కొత్త ఓటర్ల నమోదుకు కొత్త రూల్.. తల్లిదండ్రుల SIR వివరాలు తప్పనిసరి
కొత్త ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇకపై, ఆన్లైన్లో ఫార్మ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.
కొత్తగా చేర్చిన డిక్లరేషన్లో దరఖాస్తుదారు మూడు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవాలి. గత SIR ఓటరు జాబితాలో తన పేరు ఉందా, తల్లిదండ్రులు లేదా తాత, అమ్మమ్మల పేరు ఉందా అని తెలియజేయాలి. ఒకవేళ ఏమీ లేకుంటే అది కూడా స్పష్టం చేయాలి. మొదటి రెండు ఎంపికలు ఎంచుకుంటే, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబర్, ఓటరు జాబితాలో సీరియల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరిగా అందించాలి.
ఓటర్ల వివరాలను సులభంగా ధృవీకరించేందుకు, ఒకే వ్యక్తి పేరు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిబంధన తెచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. దరఖాస్తుదారుల నుంచి అవసరమయ్యే పత్రాల సంఖ్య కూడా తగ్గించే ఉద్దేశం ఉందని పేర్కొంది.
ఈ విధానాన్ని తొలిసారి బీహార్లో నిర్వహించిన SIR ప్రక్రియలో అమలు చేశారు. ప్రస్తుతం SIR పూర్తయిన లేదా కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ ఇదే నిబంధన వర్తింపజేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com