FSSAI హెరిటేజ్ ఫుడ్స్ మోసాన్ని బట్టబయలు చేసింది
ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చేస్తున్న నిబంధన ఉల్లంఘనలను కేంద్ర ఆహార భద్రత సంస్థ FSSAI బట్టబయలు చేసింది. హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ అనే పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని FSSAI తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆహార భద్రత చట్టం Food Safety and Standards Act 2006 లోని షెడ్యూల్ 5 నిబంధనల ప్రకారం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు ఫ్రెష్ అనే పదాన్ని వాడటానికి అనుమతి లేదు. ఫ్రెష్ అనే పదాన్ని కేవలం ముడి సరుకులకు మాత్రమే వినియోగించాలని చట్టం స్పష్టంగా చెప్తోంది. అయినా సరే హెరిటేజ్ సంస్థ ఈ నిబంధనను ఉల్లంఘించి తమ పన్నీర్ ఉత్పత్తికి ఫ్రెష్ అనే పదాన్ని వాడుతూ వినియోగదారులను మోసగిస్తోందని FSSAI నిర్ధారించింది.
ఇంతటితో ఆగకుండా హెరిటేజ్ సంస్థ తమ ట్రేడ్మార్క్ మరియు బ్రాండ్ నేమ్ లో హెల్దీ అనే పదాన్ని కూడా వాడుతోంది. యాడ్ అండ్ క్లెయిమ్స్ నిబంధనలు 2018 రెగ్యులేషన్ యాక్ట్ నిబంధన 83 ప్రకారం ఈ చర్య కూడా ముమ్మాటికి ఉల్లంఘనే అని FSSAI నోటీసులో పేర్కొంది. ఒక ఉత్పత్తికి హెల్దీ అనే పదాన్ని వినియోగించాలంటే ఆ ఉత్పత్తిలో తగిన పోషక విలువలు నిరూపితమై ఉండాలి కానీ హెరిటేజ్ అలాంటి ఆధారమేదీ లేకుండా ఆ పదాన్ని వాడుతోందని FSSAI స్పష్టం చేసింది.
గతంలో కూడా హెరిటేజ్ సంస్థపై కల్తీ నెయ్యి విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఒక అనుబంధ సంస్థ నుండి కల్తీ నెయ్యిని కొనుగోలు చేసిందని ఆ సందర్భంలో ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ ఫ్రెష్ పన్నీర్ వివాదంలో FSSAI కి అనేక ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో అధికారులు విచారణ జరిపి నోటీసులు జారీ చేశారు.
ఏడు రోజుల్లోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుంటే హెరిటేజ్ ఫ్రెష్ పన్నీర్ ఉత్పత్తులన్నింటినీ మార్కెట్ నుండి ఉపసంహరించుకోవాలని FSSAI ఆదేశించే అవకాశం ఉంది. మార్కెట్లో తామే నంబర్ వన్ డైరీ బ్రాండ్ అని చెప్పుకునే హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వినియోగదారుల నమ్మకంతో ఆడుకుంటోందని FSSAI ఆధారాలతో సహా రుజువు చేసింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com