జాతీయం

కేతన్ అగర్వాల్ హత్య కేసు: సియా గోయల్ స్నాప్‌చాట్ చాట్స్ కీలకంగా మారాయి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
కేతన్ అగర్వాల్ హత్య కేసు: సియా గోయల్ స్నాప్‌చాట్ చాట్స్ కీలకంగా మారాయి
📷 Mathias Reding / Pexels
షేర్ కాపీ అయింది ✓

పూణేలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్యా కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితురాలు సియా గోయల్ స్నాప్‌చాట్ చాట్స్ ఈ కేసులో కీలకంగా మారాయి. పెళ్లి ఏర్పాట్లు కొనసాగుతున్నాయని భావన కల్పించి హత్య కుట్రపై అనుమానం రాకుండా చేయడానికి ఆమె ఈ సందేశాలు పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

రికవరీ చేసిన డిజిటల్ డేటాలో పెళ్లికి విమాన టికెట్లు బుక్ చేయాలంటూ సియా సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఒక చాట్‌లో సియా గోయల్ తన స్నేహితురాలికి ఒక పెళ్లికి టికెట్లు బుక్ చేయాలంటూ ఆధార్ కార్డు ముందు వెనక భాగాల ఫోటోలు పంపమని కోరినట్లు తేలింది. దానికి ఆమె స్నేహితురాలు ఆ డాక్యుమెంట్‌ను WhatsApp లో షేర్ చేసినట్లు బదులిచ్చింది.

నిందితుల ఫోన్ల నుండి రికవరీ చేసిన డేటాలో కోడ్ వర్డ్స్, నిక్ నేమ్‌లు, ఎమోజీలతో కూడిన చాట్స్ ఉన్నట్లు పూణే పోలీసులు కోర్టుకు తెలిపారు. సీక్రెట్ కోడ్ వర్డ్స్, మారు పేర్లు, ఎమోజీలకు అర్థం నిందితులకు మాత్రమే తెలుసని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.

సియా గోయల్‌కు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని FSL కి పంపారు. నిందితులను మరింత విచారించేందుకు పోలీస్ కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ కోర్టు అందుకు నిరాకరించింది.

కేతన్ అగర్వాల్ నుండి సియా గోయల్‌కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులకు పాలీగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే లై డిటెక్టర్ టెస్ట్‌కు సియా అంగీకరించకపోవడంతో వారి సమ్మతి లేకుండా నిజనిర్ధారణ పరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం పోలీసులకు స్పష్టం చేసింది. నిందితులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే తప్ప అటువంటి పరీక్షకు అనుమతి ఇవ్వలేమని కోర్టు పేర్కొంది.

ఈ కేసులో నిందితులకు జూలై 16 వరకు 14 రోజుల పోలీస్ కస్టడీ విధించడంతో వారిని యర్వడా సెంట్రల్ జైలుకు తరలించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com