హైదరాబాద్ 33°C
అమరావతి 31°C
IST 3:03 PM
గురువారం జూలై 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

భారత్‌కు కొత్త దౌత్య పరీక్ష: UNSC ఎన్నికలో తాజికిస్తాన్ సవాలు, OIC వ్యూహం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భారత్‌కు కొత్త దౌత్య పరీక్ష: UNSC ఎన్నికలో తాజికిస్తాన్ సవాలు, OIC వ్యూహం
📷 Yogendra Singh / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంటే ప్రపంచ శాంతి భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే సంస్థ. UNSC లో మొత్తం పదిహేను దేశాలు ఉంటాయి. వాటిలో ఐదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్. మిగిలిన పది దేశాలు తాత్కాలిక సభ్యులు. ఈ తాత్కాలిక సభ్యులను ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం రెండేళ్ల కాలానికి ఎన్నుకుంటుంది. వీరికి వీటో హక్కు ఉండదు. కానీ ప్రపంచ భద్రత, ఆంక్షలు, శాంతి దళాల నియామకం, యుద్ధాలపై చర్చల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.

భారత్ ఇప్పటికే ఎనిమిది సార్లు UNSC తాత్కాలిక సభ్య దేశంగా పనిచేసింది. ఇప్పుడు 2028-29 కాలానికి మరోసారి పోటీ చేస్తుంది. భారత్‌కు ఇది కేవలం ఒక సీటు మాత్రమే కాదు, ఇది ప్రపంచ రాజకీయాలలో తన ప్రభావాన్ని మరింత బలపరుచుకునే అవకాశం. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం, ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు ప్రపంచ శాంతి పరిరక్షణ దళాలకు అత్యధిక సైనికులను అందించిన దేశాలలో కూడా భారత్ ముందంజులో ఉంది.

ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, సముద్ర భద్రత, ఇండో పసిఫిక్ వ్యూహం, గ్లోబల్ సౌత్ దేశాల తరపున మాట్లాడే నాయకత్వం ఇవన్నీ భారత్‌కు ఈ ఎన్నికల్లో బలంగా నిలుస్తున్న అంశాలు. గత కొన్ని దశాబ్దాలుగా ఆసియా పసిఫిక్ గ్రూపులో భారత్ పోటీ చేసిన సందర్భాలలో చాలాసార్లు ప్రత్యర్థి ఉండేది కాదు. కానీ ఈసారి పరిస్థితి మారింది. మధ్య ఆసియా దేశం తాజికిస్తాన్ కూడా అదే స్థానానికి పోటీ చేస్తుంది.

తాజికిస్తాన్ చిన్న దేశమే అయినప్పటికీ ఇస్లామిక్ దేశాల సమైక్య సంస్థ OIC నుంచి రాజకీయ మద్దతు లభించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. భారత్‌కు సంబంధించిన కాశ్మీర్ అంశంపై OIC గతంలో పలుమార్లు విమర్శలు చేసింది. అందువల్ల కొన్ని దేశాలు తాజికిస్తాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలపై విశ్లేషణలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసేది మొత్తం 193 UN సభ్య దేశాలు కాబట్టి ఒక్క OIC మద్దతు మాత్రమే విజయం హామీ ఇవ్వదు.

ఈ ఎన్నికల్లో భారత్‌కు ఉన్న అతి పెద్ద బలం దౌత్య సంబంధాలు. గత పది సంవత్సరాలలో భారత్ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, పసిఫిక్ దీవుల దేశాలు, గల్ఫ్ దేశాలు, యూరప్, ఇండో పసిఫిక్ ప్రాంతాలలో తన దౌత్యాన్ని గణనీయంగా విస్తరించింది. G20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం, గ్లోబల్ సౌత్ సదస్సు, వ్యాక్సిన్ మైత్రి, విపత్తుల సమయంలో మానవతా సహాయం ఇవన్నీ భారత్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

UNSC లో తాత్కాలిక సభ్యత్వం రెండు సంవత్సరాలే అయినప్పటికీ దాని రాజకీయ ప్రాధాన్యం చాలా ఎక్కువ. ప్రపంచ యుద్ధాలు, ఉగ్రవాదం, అణు ఆయుధాలు, ఆంక్షలు, శాంతి దళాల పంపిణీ ఇలాంటి కీలక అంశాలపై జరిగే చర్చల్లో సభ్య దేశానికి ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటుంది. భారత్ చాలా కాలంగా UNSC శాశ్వత సభ్యత్వం కోసం కూడా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా విజయవంతమైన తాత్కాలిక సభ్యత్వాలు భారత్ వాదనకు మరింత బలం చేకూరుస్తాయి.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com