హైదరాబాద్ 28°C
అమరావతి 32°C
IST 9:15 AM
శుక్రవారం జూలై 10 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవనాన్ని పీటీ ఉష ప్రారంభించారు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవనాన్ని పీటీ ఉష ప్రారంభించారు
📷 Helena Lopes / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ నూతన భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పీటీ ఉష మాట్లాడుతూ, తెలంగాణ ఒలింపిక్ భవనం కేవలం కార్యాలయం మాత్రమే కాదని, భవిష్యత్ ఒలింపియన్లకు దిశా నిర్దేశం చేసే కేంద్రంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని పేర్కొన్నారు. ఒలింపిక్ విలువలైన ఉత్కృష్టత, స్నేహం, గౌరవాలను ప్రోత్సహించే ఈ సౌకర్యం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మిల్కా సింగ్, పీటీ ఉష వంటి దిగ్గజాలు ప్రపంచ వేదికపై భారత కీర్తిని చాటారని గుర్తుచేశారు. ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని, యువత సోషల్ మీడియాలో సమయం తగ్గించి ఆటలపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ, సీఎం కప్ వంటి పోటీల ద్వారా యువతను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అయితే అంతర్జాతీయ మెడల్స్ సాధించడంలో ఇంకా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్న ఆవేదన వ్యక్తం చేశారు.

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ సోనీ బాలాదేవి తెలంగాణ ప్రభుత్వ క్రీడా విధానం అథ్లెటిక్ సెంట్రిక్‌గా పనిచేస్తోందని, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతోందని వివరించారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, తెలంగాణ క్రీడా విధానం దేశంలోనే అత్యంత ప్రగతిశీలమైనదని, జాతీయ క్రీడా విధానంతో సమన్వయం చేసుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు.

అనంతరం ఒలింపిక్ భవనం ముందు ఏర్పాటు చేసిన మేజర్ ధ్యాన్‌చంద్ విగ్రహాన్ని పీటీ ఉష, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరిలతో కలిసి ఆవిష్కరించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com