భాష అవరోధంతో SIR ఎన్యుమరేషన్ ఫారాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
గ్రేటర్ హైదరాబాద్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కొత్త సమస్య తలెత్తింది. నగర శివారు ప్రాంతాల్లోని ఓటర్లకు తెలుగులో మాత్రమే ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల్లో ఫారాలు అర్థం కాక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజగిరి జిల్లాల్లో కూడా ఇంగ్లీష్‌లో SIR ఫారాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. రాజేంద్రనగర్, అత్తాపూర్, కిషన్‌బాగ్, జల్పా, బహదూర్‌పుర, అరంగర్, MM పహాడి, ముస్తఫా నగర్ వంటి ప్రాంతాల్లో వేలాది మంది ఓటర్లకు BLO ఇంటింటికి వెళ్ళి SIR ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు.
ఈ ఫారాలు పూర్తిగా తెలుగులో ఉండటంతో చాలా మంది చదవలేకపోతున్నారు. ఏ కాలమ్‌లో ఏ వివరాలు నింపాలో అర్థం కావడం లేదని ఓటర్లు వాపోతున్నారు. ఫారం నింపడంలో పొరపాటు జరిగితే భవిష్యత్తులో ఓటు హక్కు పోతుందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
JHMC పరిధిలోని శివారు ప్రాంతాల్లో హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నాయి. తెలుగు మాట్లాడటం వచ్చినా చదవడం, రాయడం రాదని స్థానికులు చెప్తున్నారు. ఓటర్ల జాబితాలు కూడా తెలుగులో ఉండటంతో తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించడం కష్టంగా ఉందని అంటున్నారు.
వృద్ధులు, నిరక్షరాస్యులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబాలు అత్యధికంగా ఇబ్బందులు పడుతున్నాయి. కొంతమంది BLO లకు కూడా తెలుగులో పూర్తి అవగాహన లేక SIR ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని ప్రజలు తెలిపారు. ఎన్నికల సంఘం స్పందించి ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో కూడా SIR ఫారాలు అందుబాటులో ఉంచాలని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com