వర్షం కోసం కృష్ణా జలంతో ప్రత్యేక పూజ: 1001 బిందెలు, 101 ఎద్దులతో ఊరేగింపు
ఎల్లీలో ప్రభావం కారణంగా తెలంగాణలో వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండలం పల్లెపాడు గ్రామస్తులు వరుణదేవుడిని ప్రార్థించడానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆదివారం ఉదయం గ్రామ మహిళా రైతులు, గ్రామ పెద్దలు కృష్ణా నదికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నది నుంచి 1001 బిందెల్లో కృష్ణా జలాన్ని సేకరించారు. అక్కడ బొడ్డెమలు వేస్తూ, ఆటపాటలతో కృష్ణమ్మను వేడుకున్నారు. మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుల మధ్య 101 కాడెద్దులపై పవిత్ర జలాలను గ్రామంలోకి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
గ్రామంలోని కాశీ విశ్వనాథుడు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ జలంతో అభిషేకాలు చేశారు. గ్రామ దేవతలకు, బొడ్రాయికి, బిల్వం, రావి, వేప చెట్లకు జలతర్పణాలు నివేదించారు. ఈ పూజ చేస్తే వారం నుంచి పది రోజుల్లో వర్షం కురుస్తుందని తమ నమ్మకం అని గ్రామస్తులు చెప్పారు. ప్రతి ఏటా ఈ పూజ ముగిసిన వెంటనే వర్షం పడుతుందని, ఈసారీ వర్షం పడుతుందని ఆశిస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com