పొద్దుతిరుగుడు సాగు: అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు మెళకువలు
ప్రొద్దు తిరుగుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన నూనె గింజల పంట. ఇందులో నూనె శాతం 35 నుంచి 40% వరకు ఉంటుంది. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో దీని సాగు విస్తారంగా జరుగుతుంది.
ఈ పంట నూనెను వంటలతో పాటు సుగంధ పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. సాగుకు ఎర్ర చెలక, రేగడి, వండ్రు నేలలు అనుకూలం. ఆమ్ల, చౌడు భూములు పనికిరావు. నీటి వసతి ఉంటే ఏడాది పొడవునా వేయొచ్చు. పూత, గింజకట్టు సమయంలో అధిక వర్షాలు లేదా పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటకుండా చూస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి.
తేలిక నేలల్లో జూలై చివరి వరకు, బరువు నేలల్లో ఆగస్టు రెండో పక్షం వరకు విత్తొచ్చు. భూమిని 3-4 సార్లు దుక్కి దున్ని చదును చేయాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదల చేసిన కేబీఎస్హెచ్-44, ఎన్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1, ఎన్డీఎస్హెచ్-10,12 వంటి సంకర రకాలు మంచి దిగుబడినిస్తాయి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది.
విత్తనాన్ని 14 గంటలు నీటిలో నానబెట్టి నీడలో ఆరబెట్టి, కిలో విత్తనానికి 4 గ్రాముల తయోమిక్సోమ్ లేదా 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. వరుసల మధ్య 45-60 సెం.మీ., మొక్కల మధ్య 20-30 సెం.మీ. దూరం ఉండేలా విత్తితే సరైన మొక్కల సాంద్రత లభిస్తుంది. 15 రోజుల తర్వాత కుదురుకు ఒక ఆరోగ్యకరమైన మొక్క ఉంచి మిగతావి తొలగించాలి.
కలుపు నివారణకు లీటరు నీటికి 5 మి.లీ. పెండిమిథాలిన్ కలిపి విత్తిన వెంటనే పిచికారి చేయాలి. నెల రోజుల దశలో మనుషులతో అంతర కృషి చేస్తే కలుపు పూర్తిగా అరికట్టవచ్చు. ఎకరాకు 3 టన్నుల పశువుల ఎరువు, 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. 30, 50 రోజుల దశలో చెరో 13 కిలోల యూరియా పైపాటుగా ఇచ్చి నీటి తడి ఇవ్వాలి. గంధకం కోసం ఎకరాకు 10 కిలోల జిప్సం వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పూత దశలో పోరాక్స్ (2 గ్రా./లీ.) పిచికారి చేస్తే గింజల్లో తాలు తగ్గుతుంది.
నీటి తడులు మొగ్గ, పువ్వు, గింజకట్టు దశల్లో తప్పనిసరి. పరాగ సంపర్కానికి తేనెటీగలు ఉండేలా చూడాలి; లేదా మెత్తటి గుడ్డతో పువ్వును రుద్దాలి. పక్షుల నుంచి రక్షణకు మెరుపు రిబ్బన్లు, దిష్టి బొమ్మలు ఉపయోగించాలి. సకాలంలో కోత చేస్తే నాణ్యమైన దిగుబడి పొందవచ్చు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com