హైదరాబాద్ 33°C
అమరావతి 36°C
IST 3:05 PM
ఆదివారం జూలై 12 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం క్యూర్‌ 2026 ముసాయిదా బిల్లు విడుదల; ఆస్తిపన్ను, భవన అనుమతుల్లో మార్పులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణ ప్రభుత్వం క్యూర్‌ 2026 ముసాయిదా బిల్లు విడుదల; ఆస్తిపన్ను, భవన అనుమతుల్లో మార్పులు
📷 Sharath G. / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే చట్టం రూపంలో ‘క్యూర్ 2026’ (Core Urban Region Economy) ముసాయిదా బిల్లును విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న GHMC చట్టం స్థానంలో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చెల్, చార్మినార్ కార్పొరేషన్లకు ఈ బిల్లు వర్తిస్తుంది.

ఈ ముసాయిదా బిల్లుపై ప్రజల నుంచి ఈ నెల 24 వరకు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఆస్తి పన్ను విధానంలో కీలక మార్పు ప్రతిపాదించారు. ఇకపై వార్షిక అద్దె విలువకు బదులుగా, ఆస్తి రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా మూలధన విలువ (Capital Value) ప్రకారం పన్ను విధించనున్నారు. నివాస భవనాలకు 0.10% నుంచి 0.50% వరకు, వాణిజ్య భవనాలకు 0.20% నుంచి 2% వరకు పన్ను రేటు ఉంటుంది. ప్రతి ఆస్తికి యూనిక్ ప్రాపర్టీ ID ఇవ్వడంతోపాటు స్వీయ పన్ను మదింపు విధానం కూడా అమలు చేస్తారు.

భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో జాప్యాన్ని తగ్గించేందుకు, అధికారులు నిర్ణీత సమయంలో స్పందించకపోతే ‘డీమ్డ్ అప్రూవల్’ వర్తించేలా నిబంధనలు రూపొందించారు. చెరువులు, బఫర్ జోన్లు, ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు మాత్రం ఈ సౌలభ్యం వర్తించదు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కమిషనర్లకు సీజ్ చేసే అధికారాలు ఇవ్వనున్నారు.

వ్యాపార రంగంలోనూ సంస్కరణలు చేపట్టనున్నారు. వివిధ శాఖల నుండి లైసెన్సులు తీసుకోకుండా, ఒకే ట్రేడ్ లైసెన్స్ ద్వారా వ్యాపారాలకు అనుమతి లభిస్తుంది. మున్సిపల్ పన్నులు, విద్యుత్, నీరు, మురుగునీటి చార్జీలు, ట్రాఫిక్ చలాన్లు వంటి అన్ని చెల్లింపులు ఒకే యూటిలిటీ బిల్లులో పొందుపరచాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌ను 24 గంటల ఆర్థిక కార్యకలాపాల కేంద్రంగా మార్చేందుకు నైట్ ఎకానమీ జోన్లు ఏర్పాటు చేస్తారు.

ప్రజలకు అవసరమైన అన్ని మున్సిపల్ సేవలు, పన్ను చెల్లింపులు, ఫిర్యాదులు, అనుమతులు ఒకే డిజిటల్ పోర్టల్ ద్వారా లభిస్తాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అపిలేట్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆహారభద్రత, పోషకాహారంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ, మురుగునీటి రీసైక్లింగ్, ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలు వంటి అంశాలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ‘క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్’ ఏర్పాటు చేసి, వివిధ శాఖల మధ్య సమన్వయం మెరుగు పరుస్తారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com