తెలంగాణలో భారీ వర్షాలు: పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్లు
తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేసింది. అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com