హైదరాబాద్ 28°C
అమరావతి 33°C
IST 9:53 AM
ఆదివారం జూలై 26 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

నిలోఫర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు ఎల్బీ నగర్, పఠాన్‌చెరువులో పీడియాట్రిక్ హబ్‌లు ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
నిలోఫర్ ఆస్పత్రిపై ఒత్తిడి తగ్గించేందుకు ఎల్బీ నగర్, పఠాన్‌చెరువులో పీడియాట్రిక్ హబ్‌లు ఏర్పాటు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం
📷 Click Jeth / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణలో పిల్లల వైద్య సేవలను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిలోఫర్ ప్రభుత్వ ఆస్పత్రిపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు హైదరాబాద్‌లో రెండు పీడియాట్రిక్ హబ్‌లను ఏర్పాటు చేయనుంది.

ఎల్బీ నగర్‌లోని టిమ్స్ ఆస్పత్రిని పీడియాట్రిక్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడంతో పాటు, సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువులో మరో పీడియాట్రిక్ కేర్ హబ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నిలోఫర్ ఆస్పత్రి ఒక్కటే పిల్లల వైద్యానికి ప్రధాన కేంద్రంగా ఉంది. 1200 పడకలతో నియోనాటల్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ, గైనకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ వంటి సేవలు అందిస్తోంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రోగులు వస్తున్నందున ఆస్పత్రిపై సామర్ధ్యానికి మించి భారం పడుతోంది. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురు చిన్నారులకు చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎల్బీ నగర్ టిమ్స్‌ను ఇప్పటికే గ్యాస్ట్రో ఎంట్రాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు పీడియాట్రిక్ విభాగాన్ని కూడా అంతే స్థాయిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ కేంద్రం వల్ల ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాలతో పాటు ఏపీ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.

సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువులో రెండో పీడియాట్రిక్ హబ్ ఏర్పాటు చేస్తే ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు దగ్గరగా సేవలు అందుతాయి. అలాగే సిటీ ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా, నగర శివార్లలోనే చికిత్స పొందే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం ఈ పీడియాట్రిక్ కేంద్రాలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com