తెలంగాణ

TGSRTC యూనియన్ ఎన్నికలు: సర్వం సిద్ధం చేసిన యాజమాన్యం, తొలి నోటిఫికేషన్ రానుంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
TGSRTC యూనియన్ ఎన్నికలు: సర్వం సిద్ధం చేసిన యాజమాన్యం, తొలి నోటిఫికేషన్ రానుంది
📷 Satya Nandigam / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఉత్కంఠకు తెరదించుతూ యాజమాన్యం ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధం చేసింది. రెండు మూడు రోజుల్లో తొలి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

TGSRTC ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న యూనియన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జాయింట్ లేబర్ కమిషనర్ TGSRTC యాజమాన్యంతో సమావేశమయ్యారు. యూనియన్ వెరిఫికేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. పోలింగ్ కేంద్రాల వివరాలు, ఇంచార్జీల జాబితాను కూడా యాజమాన్యం ఎన్నికల అధికారికి అందజేసింది.

2016 జూలై 19న చివరిసారిగా ఆర్టీసీలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితా త్వరలో ప్రకటించనున్నారు.

ఎన్నికల వెనక ప్రభుత్వం వ్యూహం మరోలా ఉంది. గుర్తింపు సంఘ ఎన్నికలు పూర్తి చేసి, గెలిచిన వారిని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగస్వాములను చేయాలని సర్కార్ భావిస్తోంది. చట్టబద్ధమైన గుర్తింపు సంఘం ఉంటేనే విలీన ప్రక్రియ సులుభమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే క్షేత్రస్థాయిలో కార్మిక సంఘాల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాతే ఎన్నికలు జరగాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే సాధారణ కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన కార్మిక సంఘాల్లో కనిపిస్తోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com