జాతీయం

POK లో తీవ్ర ఉద్రిక్తతలు: భారత్‌కు సహాయం చేయమని విజ్ఞప్తి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
POK లో తీవ్ర ఉద్రిక్తతలు: భారత్‌కు సహాయం చేయమని విజ్ఞప్తి
📷 Maahid Photos / Pexels
షేర్ కాపీ అయింది ✓

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో గత నెల రోజుల నుంచి ఘర్షణ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున ప్రజలు నిరసనలు చేపట్టారు. రోజు రోజుకు ఈ నిరసన మరింత ఉద్రృతం అవుతుంది. ఈ ఆందోళనల్లో ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందుతోంది.

ఈ నేపథ్యంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నాయకుడు సర్దార్ అమాన్ ఖాన్ భారతదేశానికి కీలకమైన విజ్ఞప్తి చేశారు. ఇస్లామాబాద్ ప్రభుత్వం నిరసనలను అణచివేయడానికి కఠిన చర్యలు చేపట్టిందని, ఆర్థిక దిగ్బంధం విధించిందని ఆయన ఆరోపించారు. దీంతో ప్రజలు తీవ్రమైన ఆహార మరియు ఔషధ కొరతను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

సోషల్ మీడియాలో సర్దార్ అమాన్ ఖాన్ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. మాకు భారతదేశం సహాయం అవసరం, ఇక్కడ రేషన్ కొరత ఉంది, మాకు మీ సహాయం కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా నియంత్రణ రేఖ వద్ద సరిహద్దును తెరవాలని, పరిస్థితులు మరింత దిగజారితే ప్రజలకు భారతదేశానికి వెళ్ళే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.

రావల్ కోర్ట్ లోని ఈద్‌గాహ్ మైదానంలో జరిగిన భారీ సభలో LOC వైపు వెళ్ళాలా అని అమాన్ ఖాన్ ప్రశ్నించగా, అక్కడికి చేరుకున్న వేలాది మంది వెళ్దాం వెళ్దాం అంటూ నినాదాలు చేశారు. ప్రజల డిమాండ్లకు బదులుగా ప్రభుత్వం తూటాలతో సమాధానం ఇస్తే మాకు మరో మార్గం కూడా ఉందని ఆయన హెచ్చరించారు. పూంచ్ మరియు డోడా ప్రాంతాల వద్ద LOC ని తెరవాలని కూడా ఆయన మరోసారి డిమాండ్ చేశారు.

JAC నేతలను ఇటీవల అరెస్ట్ చేయడం మరియు సంస్థపై కఠిన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

గత వారం ఈద్‌గాహ్ మైదానంలో జరిగిన మరో భారీ నిరసన ర్యాలీలో ప్రజలు POK పాకిస్తాన్ లో భాగం కాదు, మాకు స్వాతంత్ర్యం కావాలి అంటూ నినాదాలు చేశారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు పాకిస్తాన్ రాజకీయ నియంత్రణ నుంచి పూర్తి స్వేచ్ఛ కోరే ఉద్యమంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ పీస్ స్టడీస్ తాజా నివేదిక ప్రకారం పాకిస్తాన్ ప్రధాన రాజకీయ పార్టీలే దశాబ్దాలుగా POK మరియు పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో అధికారాన్ని కొనసాగిస్తున్నాయి. స్థానిక రాజకీయ పార్టీలకు అవకాశాలు క్రమంగా తగ్గించబడ్డాయని నివేదిక పేర్కొంది. ఇస్లామాబాద్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అదే పార్టీ POK మరియు గిల్గిట్ బాల్టిస్తాన్ ఎన్నికల్లో కూడా వరుసగా విజయం సాధించడం యాదృచ్ఛికం కాదని ఆ నివేదిక అభిప్రాయపడింది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com