హైదరాబాద్ 29°C
అమరావతి 28°C
IST 3:39 PM
బుధవారం నవంబర్ 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం బ్రేకింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్: ములకలపల్లిలో 197 మిమీ వర్షపాతం

రచన: ఉషా కిరణం డెస్క్ ·
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రెడ్ అలర్ట్: ములకలపల్లిలో 197 మిమీ వర్షపాతం
📷 Peter Dyllong / Pexels
షేర్ కాపీ అయింది ✓

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మురసు తుఫాన్ ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా ములకలపల్లి మండలంలో 197 మిమీ వర్షపాతం నమోదైంది.

నాయుడుపేటలో 191.8 మిమీ, మల్కాపురంలో 165.8 మిమీ, నాగులపల్లిలో 160 మిమీ వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలంలో 191 మిమీ, అశ్వారావుపేటలో 147.8 మిమీ కురిసింది. పాల్వంచలోని సీతారామపట్నంలో 120 మిమీ, కొత్తగూడెంలో 118 మిమీ నమోదైంది. బూర్గంపహాడ్‌లో 117.5 మిమీ, చుంచుపల్లి మండలం గరిమెళ్లపాడులో 116 మిమీ వర్షపాతం నమోదైంది.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ములకలపల్లి మండలం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇటీవల కూలిపోయిన వంతెన స్థానంలో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కూడా వరదకు కొట్టుకుపోయింది.

పలు వాగులపై నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాళ్లపాయలో నసరత్ కుంట చెరువు అలుగుపారడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నీట మునిగాయి. వరద ఉధృతి మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెప్తున్నారు. వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వర్షం ఇప్పటికీ కురుస్తూనే ఉంది. ములకలపల్లి మండలానికి వెళ్లే ఏ మార్గం లేదని స్థానికులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com