సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొననున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో రెండో రోజు వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి రాజధాని అభివృద్ధి ప్రణాళికలు, సెమీకండక్టర్ రంగ విస్తరణపై చర్చిస్తారు.
వరల్డ్ సిటీస్ సమ్మిట్ అనంతరం, సీఎం చంద్రబాబు ఆసియా పసిఫిక్ సెమీకండక్టర్ ఎకోసిస్టం పై రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో సమావేశమై పట్టణ అభివృద్ధి ప్రణాళికలపై చర్చిస్తారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధాని, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి, విదేశాంగ సహాయ మంత్రి తదితర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు.
సాయంత్రం సిట్రియం ప్రతినిధులతో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ విషయాలపై చర్చిస్తారు. ఐహెచ్‌సిసిఐ బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి చర్చిస్తారు. ఈ రెండు రోజుల పర్యటనతో సీఎం చంద్రబాబు తిరిగి రాష్ట్రానికి వెళతారు.
నిన్న జరిగిన సమావేశాల్లో సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ అయ్యారు. టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం, ఏఐ యూనివర్సిటీ పరిశోధనలకు సహకారం అందించాలని కోరారు. సెమీకండక్టర్ల తయారీ ఎకోసిస్టం, కెపాసిటీ బిల్డింగ్‌లో తోడ్పాటు, అమరావతి సహా రాష్ట్రంలోని నగరాల్లో అర్బన్ గవర్నెన్స్ సహకారం కోరారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను సింగపూర్ దిగుమతి చేసుకునే అంశాన్ని పరిశీలించాలని ప్రతిపాదించారు.
అనంతరం సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రితోనూ సమావేశమయ్యారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ గ్రూప్‌తో ఏపీలో అత్యాధునిక సప్లై చైన్ సిటీ నిర్మాణంపై చర్చించారు. యూఎన్ హాబిటాట్ ప్రతినిధులతో భేటీలో ఏపీలో యూఎన్ హాబిటాట్ సెంటర్ ఏర్పాటు, రైజ్ అప్ కార్యక్రమం అమలు చేయాలని సీఎం కోరారు. ఈ ప్రతిపాదనకు యూఎన్ హాబిటాట్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com