చైనా డిజిటల్ నిఘా: విదేశీ పర్యాటకుల డేటా సేకరించినట్లు ఆరోపణలు
చైనాలో పర్యటనకు వెళ్లిన విదేశీయుల వ్యక్తిగత సమాచారాన్ని చైనా ప్రభుత్వం భారీగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ సైబర్ భద్రత పరిశోధకుడు మార్క్ హోఫర్ ఈ విషయాన్ని బయటపెట్టారు.
డార్క్ వెబ్ పరిశోధనలో భాగంగా ఒక రహస్య వెబ్‌సైట్‌లో స్వయంగా తన పేరు, ఫోన్ నెంబర్, పాస్పోర్ట్ వివరాలతో సహా పలువురి డేటా కనిపించింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో భారతదేశం, అమెరికా, బ్రిటన్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, ఇజ్రాయిల్, ఈజిప్ట్, పాకిస్తాన్ వంటి దేశాలకు చెందిన లక్షలాది మంది విదేశీ పర్యాటకుల డేటా నిక్షిప్తమై ఉన్నట్లు హోఫర్ గుర్తించారు.
ముఖ్యంగా చైనాలోని జాంగ్ జియాకో నగరంలోని హెబే నార్త్ యూనివర్సిటీలో చదివిన భారతీయ, పాకిస్తానీ విద్యార్థుల సమాచారం భారీగా ఉన్నట్లు తెలిపారు. హోఫర్ నివేదిక ప్రకారం, చైనా పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్లిన తర్వాత కూడా వ్యక్తులపై నిఘా కొనసాగుతుంది. ఫోన్ సిగ్నల్స్, డిజిటల్ నెట్వర్క్‌లు, ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, రోబోటిక్స్ కంపెనీల డేటాబేస్‌ల ద్వారా వారి ప్రయాణాలు, సంభాషణలు ట్రాక్ చేస్తున్నట్లు వెల్లడైంది.
చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలపై ఇప్పటివరకు స్పందించలేదు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com