హైదరాబాద్ 23°C
అమరావతి 22°C
IST 8:00 AM
సోమవారం నవంబర్ 16 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
వాతావరణం

ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది.. కోహీర్‌లో 11.3°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది.. కోహీర్‌లో 11.3°C కనిష్ట ఉష్ణోగ్రత నమోదు
📷 Shardar Tarikul Islam / Pexels
షేర్ కాపీ అయింది ✓

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చలి తీవ్రత పెరుగుతోంది. ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ ప్రాంతంలో 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. కొమరంభీమ్ జిల్లాలో 11.2 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 11.6 డిగ్రీలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌లో 11.5 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లాలో 11.4 డిగ్రీలు, వికారాబాద్ జిల్లాలో 11.7 డిగ్రీలు, మేడ్చల్ జిల్లాలో 13.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

సంగారెడ్డి జిల్లాలోని 25 గ్రామాల్లో 15 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మెదక్ జిల్లాలోని 13 గ్రామాల్లో, సిద్దిపేట జిల్లాలోని 20 గ్రామాల్లోనూ 15 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ తగ్గుతున్నాయి. చలి తీవ్రత వల్ల సాయంత్రమే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాత్రి సమయాల్లో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఏజెన్సీ ప్రాంతంలో చలి తీవ్రత పెరిగింది. చలితో పాటు మంచు కమ్మడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం మంటలు వేసుకుంటున్నారు.

విశాఖ మన్యం ఏజెన్సీలోనూ చలి తీవ్రత ఉంది. పాడేరు మన్యం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గిరిజనులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముతోంది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. డుమ్మిరిగూడలో 13.3 డిగ్రీలు, అరకులోయ ముంచంగిపుట్టులో 13.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టు మండలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సుజనకోట, పెదగూడ, దారేల, జోలపుట్టు, పనసపుట్టు, లక్ష్మీపురం, బూసిపుట్టు పంచాయతీల పరిధిలో వాగుల పరిసర ప్రాంతాల్లో చలి కొంచెం ఎక్కువగా ఉంది. దట్టమైన మంచి కారణంగా ఉదయం వేళల్లో ప్రజలు వాగులు దాటడానికి ముందుకు రావడం లేదు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com