2027 గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు: ఆలయాల పునరుద్ధరణకు రూ.100 కోట్లు కేటాయింపు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు రూ.100 కోట్లు కేటాయించినట్లు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు తెలిపారు.
ఈ ఏర్పాట్లు కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల పరిధిలో కొనసాగుతున్నాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో 8 దేవాలయాలకు రూ.1.10 కోట్లు, కొత్తపేటలో 33 దేవాలయాలకు రూ.8.87 కోట్లు మంజూరయ్యాయి. అలాగే రాజోలులో 16 దేవాలయాలకు రూ.4.76 కోట్లు, నిడదవోలులో 22 దేవాలయాలకు రూ.6.40 కోట్లు, మండపేటలో 11 దేవాలయాలకు రూ.4.59 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 23 దేవాలయాలకు రూ.5.29 కోట్లు, పాలకొల్లులో 10 దేవాలయాలకు రూ.1.25 కోట్లు, నరసాపురంలో 10 దేవాలయాలకు రూ.2.82 కోట్లు కేటాయించారు.
పుష్కర స్నానాల తర్వాత భక్తులు సందర్శించే అన్నవరం, కోటిలింగాల వంటి ప్రధాన ఆలయాల్లోనూ మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నారు. 2015 నాటి పుష్కరాలతో పోలిస్తే ఈసారి రెట్టింపు భక్తులు వస్తారని అంచనా. అన్నవరం ఆలయాన్ని 2015లో లక్ష మంది దర్శించగా, ఇప్పుడు రెండు లక్షల మంది వస్తారని భావిస్తున్నట్లు త్రినాథరావు చెప్పారు.
పిండప్రధానాల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అర్చక సంఘాలు, పురోహితులతో సమన్వయం చేసుకుంటూ వారికి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. పిండప్రధానాల రుసుము ముందే భక్తులకు తెలియజేసే ఏర్పాటు ఉంటుందని త్రినాథరావు వివరించారు.
2027 జూన్ 20 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి నుంచి టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టినట్లు ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంలో పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జాయింట్ కమిషనర్ పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com