వాతావరణం

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు - ముంబై నగరం జలదిగ్బంధనంలో చిక్కుకుంది

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు - ముంబై నగరం జలదిగ్బంధనంలో చిక్కుకుంది
📷 Esra Afşar / Pexels
షేర్ కాపీ అయింది ✓

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశమంతటా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో రోడ్లన్నీ కాల్వలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. ముంబై మహానగరం జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. తానే జిల్లాలోని భివండి జలమయమైంది. వసాయి ప్రాంతం నీట మునిగింది. కొలాబా ప్రాంతంలో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. నవీ ముంబైలో ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది. తుర్బే రైల్వే స్టేషన్ సమీపంలోని రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి.

ముంబైలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో సముద్రం అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రపు అలలు గేట్వే ఆఫ్ ఇండియాను తాకేలా ఎగసిపడుతున్నాయి. అంధేరి సబ్వే నీట మునగడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ అవుతోంది. పట్టాలపై నీళ్లు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ముంబైతో పాటు తానే, పాల్గర్, రాయగడ్, రత్నగిరి, సింధూదుర్గ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. బృహత్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో SDRF స్పెషల్ టీమ్స్ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

జమ్మూ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రామ్నగర్ ఉదంపూర్ హైవేపై కొండచరియలు విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. JCB లతో పోలీసులు, SDRF సిబ్బంది రెస్క్యూ కొనసాగిస్తున్నారు.

గుజరాత్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజ్కోట్, జునాగఢ్, డాంగ్ జిల్లాల్లో కుండపోత వానలు అనర్థాలు సృష్టిస్తున్నాయి. రాజ్కోట్ లో అనేక ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకున్నాయి. జునాగఢ్ జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. మండ్లలో నర్మదా నది డేంజర్ లెవెల్ లో ప్రవహిస్తోంది. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ లో భారీగా వర్షాలు పడుతున్నాయి. మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని IMD తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని అధికారులు సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com