దేశంలో భారీ వర్షాలు: కేరళలో 8 మంది మృతి, హిమాచల్‌లో 102 రోడ్లు మూత
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కేరళ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, అసోం, ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
కేరళలో కుండపోత వర్షాలకు ఇప్పటివరకు 8 మంది మరణించారు. మరో 8 మంది గల్లంతు కాగా, 13 మంది గాయపడ్డారు. పతనంతిట్ట సహా పలు ప్రాంతాలు ముంపులో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో 5,000 మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గినా పూర్తి స్థాయిలో అదుపులోకి రాలేదు. మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ సీఎం పినరయి విజయన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. 102 రోడ్లను మూసివేశారు. మండి, కులు, సిమ్లా, చంబా, కాంగ్రా, సిర్మౌర్ జిల్లాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. ఆగస్టు 7 వరకు భారీ వర్షాల అలర్ట్‌ను ఐఎండీ జారీ చేసింది.
గుజరాత్‌లోని సూరత్, ఖేడా, ఆనంద్, వల్సాద్ జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటిలో ఉన్నాయి. 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అసోంలో బ్రహ్మపుత్ర నదిలో ఐఐటి గౌహతి విద్యార్థులు ఇద్దరు ప్రమాద శాతు జారిపోగా, ఒకరు మృతి చెందారు, మరొకరిని రక్షించారు. ఉత్తరాఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా వర్షాలు కొనసాగుతున్నాయి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com