జనక్‌పూర్-అయోధ్య మధ్య కొత్త వీక్లీ రైలు.. రైల్వే శాఖ ప్రకటన
నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య కంటోన్మెంట్ వరకు కొత్త వీక్లీ రైలు సర్వీసు నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. ప్రతి శనివారం జనక్‌పూర్ ధామ్ నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి సోమవారం అయోధ్య కంటోన్మెంట్ నుంచి బయలుదేరుతుంది. బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల మీదుగా ఈ రైలు వెళ్తుంది.
మార్గమధ్యంలో జయనగర్, మధుబానీ, సీతామర్హి, రక్సౌల్, నర్కటియాగంజ్, గోరఖ్‌పూర్, బస్తీ, మన్కాపూర్, అయోధ్య ధామ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. రాముడి జన్మస్థలిగా భావించే అయోధ్యను, సీతాదేవి జన్మస్థలిగా పూజించే నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్‌ను ఈ రైలు నేరుగా కలుపుతుంది.
ఇది భారత్-నేపాల్ సరిహద్దు దాటే రైలు కావడంతో కస్టమ్స్, ఇమిగ్రేషన్, భద్రతపై ఇరు దేశాల అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. బీహార్‌లోని జయనగర్ రైల్వే స్టేషన్‌లో ఇరు దేశాల అధికారులు సమావేశమై ఈ విషయంపై చర్చించారు. నేపాల్ భూభాగంలో నేపాల్ భద్రతా సంస్థలు, భారత భూభాగంలో భారత భద్రతా సంస్థలు ప్రయాణికుల భద్రతను పర్యవేక్షిస్తాయని అంగీకారం కుదిరింది.
ఈ నెలలో 17 భోగిలతో జయనగర్ నుంచి కుర్తా వరకు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సర్వీసు రామాయణ సర్క్యూట్ పర్యటనను ప్రోత్సహిస్తుందని రైల్వే శాఖ తెలిపింది. మార్గంలోని టూరిజం ఆపరేటర్లు, హోటళ్లు, స్థానిక వ్యాపారులు, సంప్రదాయ హస్తకారులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొంది. బీహార్-నేపాల్ సరిహద్దు ప్రాంతాల ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక సంబంధాలు బలపడతాయని తెలిపింది. ప్రస్తుతం భారతీయ రైల్వే ఈ రైలును నిర్వహిస్తుంది. ప్రయాణికుల రద్దీని బట్టి భవిష్యత్తులో సర్వీసుల సంఖ్యను పెంచుతామని రైల్వే శాఖ తెలిపింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com