దేశీయ తయారీ సైనిక విమానం C-295 తొలి పరీక్ష విజయవంతం
గుజరాత్‌లోని వడోదరలో భారత రక్షణ రంగానికి సంబంధించి చారిత్రాత్మక ఘటన జరిగింది. పూర్తి దేశీయంగా తయారైన తొలి సైనిక రవాణా విమానం C-295 తన మొదటి పరీక్ష విమానాన్ని విజయంతం పూర్తి చేసింది. దేశంలో ఒక ప్రైవేట్ సంస్థ పూర్తి స్థాయి సైనిక విమానాన్ని నిర్మించి పరీక్షించడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ బాధ్యత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) మాత్రమే నిర్వహించేది.
2021 సెప్టెంబర్‌లో కేంద్ర రక్షణ శాఖ ఎయిర్‌బస్ సంస్థతో 21,935 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 56 C-295 విమానాల కొనుగోలుకు ఈ ఒప్పందం జరిగింది. ఇందులో 16 విమానాలు నేరుగా స్పెయిన్ నుంచి దిగుమతి కాగా, మిగిలిన 40 విమానాలను సంపూర్ణ సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేయాల్సి ఉంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) భాగస్వామ్యంతో వడోదరలో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయగా, అక్కడే ఈ విమానం రూపుదిద్దుకుంది. తాజా పరీక్ష విజయం ద్వారా ఈ ప్లాంట్ కేవలం విడిభాగాల అమరికే కాకుండా పూర్తి స్థాయి విమాన పరీక్షల దశకు చేరుకుందని నిరూపితమైంది. ఎయిర్‌బస్ సంస్థ ఐరోపా వెలుపల సైనిక విమానాన్ని నిర్మించడం కూడా ఇదే ప్రథమం.
ఈ C-295 విమానాలు భారత వాయుసేనలో ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తున్న అవ్రో హెచ్‌ఎస్-748 విమానాల స్థానాన్ని భర్తీ చేస్తాయి. ఇవి ఒకేసారి 71 మంది సైనికులను లేదా 50 మంది పారాట్రూపర్లను, 9 టన్నుల కార్గోను తీసుకెళ్లగలవు. చిన్న రన్వేల నుంచి కూడా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలవు. ఎడారులు, తీరాలు, హిమాలయాలు, మంచు ప్రాంతాలు వంటి కఠినమైన ప్రదేశాల్లోనూ ఇవి ఆపరేట్ చేయగలవు. విపత్తు నిర్వహణ, వైద్య సహాయం, సరిహద్దు ప్రాంతాలకు వేగంగా బలగాల తరలింపులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ ప్రాజెక్ట్ కేవలం రక్షణ రంగానికే పరిమితం కాదు. దేశంలో బలమైన ఏరోస్పేస్ తయారీ నెట్‌వర్క్ ఏర్పడేందుకు ఇది సహాయపడుతుంది. వడోదర ప్లాంటుతో పాటు వివిధ రాష్ట్రాల్లోని అనేక చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఈ విమానానికి కావాల్సిన విడిభాగాలు, పరికరాలు సరఫరా చేస్తున్నాయి. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సెప్టెంబర్ 2023 లో స్పెయిన్ నుంచి వచ్చిన మొదటి C-295 విమానం ఇప్పటికే వాయుసేనలో సేవలు అందిస్తోంది. తాజా దేశీయ విమాన పరీక్ష విజయంతో రక్షణ రంగం స్వావలంబన దిశగా మరో ముందడుగు పడింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com