అంతర్జాతీయం

హార్ముజ్ జలసంధి: 60 రోజుల పాటు టోల్ ఫీజు రద్దు చేసిన ఇరాన్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
హార్ముజ్ జలసంధి: 60 రోజుల పాటు టోల్ ఫీజు రద్దు చేసిన ఇరాన్
📷 Khánh Quan / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందంతో హార్ముజ్ జలసంధిపై నౌకా రాకపోకలు సాధారణ స్థితికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. రాబోయే 60 రోజుల పాటు హార్ముజ్ మార్గం గుండా వెళ్లే వాణిజ్య నౌకల నుంచి ఎలాంటి నౌకాయాన రుసుము వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

ఈ రెండు నెలల కాలానికి అయ్యే మొత్తం ఖర్చును ఇరాన్ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపింది. ఈ ఉచిత ప్రయాణ సదుపాయం పొందాలనుకునే నౌకలు పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీకి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, నౌకల రాకపోకలను వేగవంతం చేయాలని, భద్రత కారణాల దృష్ట్యా కేటాయించిన మార్గాలు, సమయపాలన పాటించాలని అధికారులు ఆదేశించారు. హార్ముజ్ జలసంధిలో అమర్చిన సముద్రపు మైన్ల తొలగింపు త్వరలో ప్రారంభం కానుందని ఇరాన్ వెల్లడించింది.

అటు అమెరికా కూడా ఇరాన్పై విధించిన నౌకాదిగ్బంధనాన్ని పూర్తిగా తొలగించింది. ఇరాన్ నౌకాశ్రయాలకు వచ్చే-పోయే వాణిజ్య నౌకలను తాము అడ్డుకోవడం లేదని, నౌకాయానానికి ఎలాంటి ఆటంకాలు సృష్టించడం లేదని యూఎస్ కమాండ్ స్పష్టం చేసింది.

హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంతో, గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిని యుద్ధానికి ముందు స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. కువైట్ రాబోయే వారంలో ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారళ్లకు పెంచనుంది. దెబ్బతిన్న పైప్లైన్ల మరమతులు పూర్తి చేసి, యథావిధిగా సరఫరా చేస్తామని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. ఇరాక్ చమురు శాఖ మంత్రి బాసిం మహమ్మద్ కుదైర్ కూడా చమురు క్షేత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని, ఉత్పత్తి క్రమంగా పూర్వ స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com