కరీంనగర్లో 65 ఏళ్ల మహిళ రోడ్డుపై.. కుమార్తెల నిర్లక్ష్యంపై ఆరోపణలు
కరీంనగర్ జిల్లా అలుగునూరు తమిళ కాలనీలో 65 ఏళ్ల నల్ల రాజేశ్వరి రోడ్డుపై ఉంటోంది. పక్షవాతంతో ఆమెకు నడిచే శక్తి లేదు. ఆమెను ఎవరూ చూసుకోవడం లేదని స్థానికులు చెప్తున్నారు.
రాజేశ్వరి భర్త, కుమారుడిని ఇప్పటికే కోల్పోయారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు హైదరాబాద్లో నివసిస్తున్నారు. కుమార్తెలు తనను పట్టించుకోవడం లేదని రాజేశ్వరి చెప్తోంది. స్థానికులు కూడా ఇదే విషయం చెప్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల వల్ల రాజేశ్వరి తన ఇంటిని బంధువులకు విక్రయించారు. తాను బతికున్నంత కాలం అదే ఇంట్లో ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇల్లు కొన్న బంధువులు తాళం వేసి ఆశ్రయం నిరాకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఒక కుమార్తె ఆమెను మధ్యాహ్నం తీసుకొచ్చి, తాను చూసుకోలేనని చెప్పి, ఆమె అమ్మిన ఇంటి ఎదుట రోడ్డుపై వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. కాలనీవాసులు కుమార్తెలకు ఫోన్ చేసి మాట్లాడగా, తాము చూసుకోలేమని వారు చెప్పినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి.
గత రెండు రోజులుగా కాలనీవాసులే ఆమెకు భోజనం అందిస్తున్నారు. గుడి వద్ద ఆశ్రయం కల్పించి టిఫిన్, ఆహారం ఇస్తున్నారు. ఆమెను వృద్ధాశ్రమానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు. కార్పొరేటర్ కల్లా మల్లేషం ఆమె పరిస్థితిని పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com