ఏలూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ నమూనాలను పరిశీలించిన కెన్యా ప్రతినిధులు
కెన్యా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేసింది. సీడ్ సేవర్ నెట్వర్క్, స్లో ఫుడ్ కెన్యా, గ్లోబల్ ఫీల్డ్ నెట్వర్క్ తో పాటు న్యూయార్క్ యూనివర్సిటీ అబుదాబీకి చెందిన ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. రైతు సాధికార సంస్థ (RySS) అధికారులతో కలిసి వారు పలు ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
ద్వారకా తిరుమల మండలం గుణంపల్లి గ్రామంలో రైతు వెంకట సుబ్బారెడ్డి సాగు చేస్తున్న PMDS ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని ప్రతినిధులు పరిశీలించారు. ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణంలోనూ భూసారం, నేలలో సూక్ష్మ జీవుల వృద్ధి, తేమ నిల్వ, జీవవైవిధ్యం పెరగడాన్ని వారు గమనించారు.
ఉంగటూరు మండలం ఆగువరం గ్రామంలో రైతు యు. రామచంద్రరావు అభివృద్ధి చేసిన ఏడెకరాల సమగ్ర ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా వారు సందర్శించారు. ఆయిల్ పామ్, అరటి వంటి పంటలను సమన్వయంతో సాగుచేస్తూ గత ఏడేళ్లుగా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందుతున్న విధానం గురించి రైతు వివరించారు.
ఏలూరు మండలం వెంకటాపురంలోని 14 ఎకరాల ప్రకృతి వరి కాంపాక్ట్ బ్లాకును సందర్శించిన ప్రతినిధులు ద్రవ జీవామృతం, ఘన జీవామృతం వంటి ప్రకృతి ఇన్‌పుట్‌లతో రైతులు విజయవంతంగా సాగు చేస్తున్న తీరును ప్రత్యక్షంగా చూశారు. ఏలూరు జిల్లాలో RySS ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ నమూనాలు తమనెంతో ఆకట్టుకున్నాయని కెన్యా ప్రతినిధులు తెలిపారు. ఈ విధానాలను తమ దేశంలో కూడా అమలు చేయాలనే ఆసక్తి చూపుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ నమూనా ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com