నాగర్‌కర్నూల్: విద్యుత్ లైన్ పేరుతో టేకు చెట్ల తొలగింపు; రైతు ఫిర్యాదు
నాగరకర్నూల్ జిల్లా ఎన్నబేట్ల గ్రామంలో విద్యుత్ లైన్ అడ్డంకిగా ఉన్నాయనే కారణంతో ఓ రైతు పొలంలోని టేకు చెట్లను అధికారులు తొలగించారు. రైతు సేవకుల బుచ్చన్న వ్యవసాయ పొలంలో సుమారు 20 ఏళ్ల క్రితం నాటిన ఈ చెట్లను రాత్రివేళ జేసీబీతో నేలకూల్చినట్టు తెలిసింది.
సాధారణంగా కొమ్మలు మాత్రమే తొలగించాల్సిన పరిస్థితిలో చెట్లను పూర్తిగా తొలగించడం, ముందస్తు నోటీసు ఇవ్వకపోవడంపై బాధిత కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమారు 16 టేకు చెట్లు ధరాశాయి అవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
రైతు బుచ్చన్న మాట్లాడుతూ, '20 ఏళ్ల క్రితం నాటిన ప్రతి మొలకకు అప్పట్లో రూ.350 చెల్లించాను. ప్రస్తుతం వీటి విలువ రూ.70 వేల వరకు ఉండేది. ముందే చెప్పి ఉంటే నేనే విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసుకునేవాడిని' అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఘటనపై విద్యుత్ అధికారులను సంప్రదించగా తమకు సంబంధం లేదని చెప్పినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి చెట్లను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని, రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com