ఖరీఫ్‌లో వరి నారుమడి యాజమాన్యం: శాస్త్రవేత్త సూచనలు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లో రైతులు వరి నారుమడులు పోస్తున్నారు.
వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మాధవి ఆరోగ్యకరమైన నారు కోసం పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. దీర్ఘకాలిక రకాలు (140 రోజులు) జూన్ చివరి వరకు, మధ్యకాలిక రకాలు (130-135 రోజులు) జూన్ 15 వరకు, స్వల్పకాలిక రకాలు (120-125 రోజులు) జూలై చివరి వరకు నారు పోసుకోవచ్చు.
ఒక ఎకరానికి రెండు గుంటల నారుమడి సరిపోతుంది. ముందుగా మాగిన పశువుల ఎరువు వేసి ఎత్తైన నారుమడులు చేసుకోవాలి. విత్తనం రకాన్ని బట్టి ఎకరానికి దొడ్డ గింజ రకాలకు 25 కిలోలు, సన్న గింజకు 20 కిలోలు, అతి సన్న గింజకు 15 కిలోల విత్తనం అవసరం. విత్తన శుద్ధి తప్పనిసరి.
మెట్ట నారుమడికి కిలో విత్తనానికి 3 గ్రాముల Carbendazim తడిపి పట్టించాలి. దమ్ము చేసిన నారుమడికి కిలో విత్తనానికి 1 గ్రా Carbendazim ని లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టి, మొలకెత్తిన విత్తనాల్ని చల్లాలి. రెండు గుంటల నారుమడికి నత్రజని 2 కిలోలు, భాస్వరం 1 కిలో, పొటాషియం 1 కిలో ఎరువులు వేయాలి. విత్తనం చల్లిన వారం రోజులు ఆరుతడి పద్ధతిలో నీరు ఇవ్వాలి.
నాటుకి వారం ముందు కార్బోఫ్యురాన్ 3G గ్రాన్యుల్స్ 800 ml వేస్తే కాండం తొలిచే పురుగు నుంచి రక్షణ లభిస్తుంది. కలుపు నివారణకు 15-20 రోజులకు Cyhalofop butyl 1.5 ml లేదా Bispyribac sodium 0.5 ml లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. జింక్ లోపం కనిపిస్తే జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేయాలి. మెట్ట నారుమడిలో ఐరన్ లోపం వస్తే 5 గ్రాముల అన్నబేది, 1 గ్రా నిమ్మ ఉప్పు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com