హైదరాబాద్ 25°C
అమరావతి 31°C
IST 8:59 AM
బుధవారం ఆగస్టు 5 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

వరి రైతులకు పురుగుల నివారణపై శాస్త్రవేత్తల సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
వరి రైతులకు పురుగుల నివారణపై శాస్త్రవేత్తల సూచనలు
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఈ ఏడాది ఆలస్యమైన వర్షాల వల్ల చాలా చోట్ల వరి నాట్లు ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం పిలక దశ నుంచి దుబ్బు దశ వరకు పంటలు ఉన్నాయి. ఈ సమయంలో కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, సుడిదోమ లాంటి పురుగులు ఆశించే ప్రమాదం ఉందని రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త రామగోపాల్ వర్మ తెలిపారు.

ముఖ్యంగా కాండం తొలుచు పురుగు నారుమడి దశ నుంచి కంకి వేసే దశ వరకు నష్టం కలిగిస్తుంది. దీని తల్లి పురుగు ఆకుల చివర గుడ్లు పెడుతుంది. 5 నుంచి 9 రోజుల్లో పిల్ల పురుగులు మొక్కల మొదళ్లకు చేరి కాండాన్ని తొలిచి నష్టం కలిగిస్తాయి. సకాలంలో నివారించకపోతే 20 నుంచి 30 శాతం దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగు ఉదృతిని గమనించడానికి ఎకరానికి మూడు లింగాకర్షక బుట్టలు పెట్టాలి. బుట్టకు 25-30 పురుగులు పడితే నివారణ చేపట్టాలి. 25-30 రోజుల పైరుకు క్లోరంట్రానిలిప్రోల్ 4G గుళికలు 4 కిలోలు లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు 8 కిలోలు 20 కిలోల ఇసుకతో కలిపి పొలంలో జల్లుకోవాలి.

నిజామాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉల్లికోడు ఆశించినట్లు సమాచారం అందుతోంది. ఈ పురుగు ఆకులు ఉల్లిగొట్టాలుగా చేసి వెన్ను రాకుండా చేస్తుంది. ఉల్లికోడు తట్టుకునే రకాలు సాగు చేసిన ప్రాంతాల్లో ఫిప్రోనిల్ 3% గుళికలు 8 కిలోలు లేదా 0.6% గుళికలు 4 కిలోలు ఎకరానికి పల్చగా నీరుంచి వేయాలి.

సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో సుడిదోమ ఉధృతం ఎక్కువగా ఉంటుంది. పిలక దశలో 10-15 దోమలు, అంకురం దశలో 20-25 దోమలు ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా సన్నగింజ రకాల్లో ఉదృతి ఎక్కువ. ఈ పురుగు కోసం క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్ లాంటి మందులు వాడితే దోమ ఉదృతిని పెంచుతాయి. బదులుగా పైమెట్రోజైన్ 0.5 గ్రాములు, డైనోటెఫ్రాన్ 0.4 గ్రాములు, ట్రైఫ్లూమెజోపైరిం 0.48 మి.లీ. లీటర్ నీటికి చొప్పున మార్చి మార్చి పిచికారీ చేయాలి.

ఈ మూడు పురుగులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో నివారణ చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com