తెలంగాణ

తెలంగాణలో రాబోయే 3-4 రోజుల్లో వర్షాలు; సన్నద్ధతపై సీఎం అసంతృప్తి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తెలంగాణలో రాబోయే 3-4 రోజుల్లో వర్షాలు; సన్నద్ధతపై సీఎం అసంతృప్తి
📷 https://www.youtube.com/@mangonews / Wikimedia Commons / cc-by
షేర్ కాపీ అయింది ✓

వాతావరణ శాఖ తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18 నుంచి 20 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని, వచ్చే నాలుగైదు రోజుల్లో రాష్ట్రమంతటా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఆదివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈదురు గాలులకు రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. హైదరాబాద్‌లో కురిసిన వర్షంతో సిటీ చెరువులకు వరద నీరు చేరింది. 8 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40°లపై నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా కానాపూర్‌లో 40.6°C ఉష్ణోగ్రత నమోదైంది.

మరోవైపు, వర్షాలు, ప్రకృతి విపత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీ లోని బోధి పెవిలియన్‌లో మాన్సూన్ సీజన్ సన్నద్ధతపై అధికారులతో చర్చించారు. జూన్ 1న రివ్యూ పెట్టి ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ, జూన్ 9న కురిసిన భారీ వర్షానికి అధికారులు సరిగా స్పందించలేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం సమయంలో కోర్ ఏరియాలో మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లేదని ఆయన మండిపడ్డారు.

వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్ స్పాట్లు, ట్రాఫిక్ జామ్ ప్రాంతాల డేటా ఆధారంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని, ఫీల్డ్‌లో లేని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వర్షం పడినప్పుడు ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపై ఉండాలని, అవసరమైతే తాను కూడా రోడ్లపైకి వస్తానని చెప్పారు. భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com