అన్ని గిరిజన గ్రామాలకు బీటీ రోడ్లు: ప్రభుత్వం భారీ ప్రణాళిక
రాష్ట్రంలోని మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రెండు ప్రధాన ప్రాజెక్టులను చేపడుతోంది. ప్రస్తుతం గిరిజనుల రవాణ కష్టాలు తీర్చేందుకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఈ పనులు చేపట్టనున్నారు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) కింద రూ. 6,294.81 కోట్లతో 2,162 రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 7,449.50 కిలోమీటర్ల మేర రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 14 ప్యాకేజీలకు లెటర్ ఆఫ్ అవార్డ్ జారీ చేశారు. మొత్తం 17 ప్యాకేజీలుగా విభజించిన ఈ పనులు దశలవారీగా పూర్తవుతాయి.
రాష్ట్రంలోని మొత్తం 23,170 ఆవాసాల్లో 21,276 చోట్ల రోడ్లు ఉన్నాయి. మిగిలిన 1,894 ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించాల్సి ఉంది. ఇందులో 770 గిరిజన తండాలు ఉన్నాయి. మరో 1,124 ఆవాసాల్లో 193 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ. 1,550 కోట్లు అవసరమని అంచనా.
అటవి ప్రాంతంలో ఉన్న తండాలకు రోడ్లు వేసేందుకు కేంద్ర అటవి శాఖ అనుమతులు, భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధీనంలో 68,708 కిలోమీటర్ల రోడ్ల నెట్వర్క్ ఉండగా, 26,503 కిలోమీటర్లు మాత్రమే బీటీ రోడ్లు ఉన్నాయి. మిగిలిన రహదారులను దశలవారీగా తారు రోడ్లుగా మార్చనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com