10 జిల్లాల్లో జన చైతన్య యాత్రలు నిర్వహిస్తాం: MP మల్లు రవి
కాంగ్రెస్ MP మల్లు రవి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు 10 జిల్లాల్లో జన చైతన్య యాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి నెల SC, ST ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రతి సమావేశానికి ఒక్కో దళిత మంత్రిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తామని పేర్కొన్నారు.
దిల్కుషా గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన SC సామాజిక వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. CM రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 27 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ పిల్లలకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెస్ చార్జీలు 40% పెంచారని, పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలని CM చెప్తున్నారని మల్లు రవి వివరించారు. రేషన్ షాప్ లో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారని, ఇంతకుముందు నాసిరకం బియ్యం ఇచ్చేవారని తెలిపారు.
BRS, BJP నాయకులు ప్రభుత్వాన్ని, CM రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తూ అబద్ధాల ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. KTR, హరీష్ రావు, BJP నాయకులు గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. వారికి ధీటుగా ఈ నెల నుంచే జన చైతన్య యాత్ర కార్యక్రమం మొదలుపెడతామని స్పష్టం చేశారు.
PCC SC డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో SC ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక సమావేశమయ్యారని, SC నియోజక వర్గాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి CM కు వినతి పత్రం అందిస్తామని మల్లు రవి తెలిపారు. సామాజిక న్యాయం కోసం CM చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com