తెలంగాణ

ఫోన్ టాపింగ్ కేసు: మాజీ ఏఎస్పీ భుజంగరావు ఆస్తులపై ఏసీబీ సోదాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఫోన్ టాపింగ్ కేసు: మాజీ ఏఎస్పీ భుజంగరావు ఆస్తులపై ఏసీబీ సోదాలు
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఫోన్ టాపింగ్ కేసు నిందితుడిగా ఉన్న మాజీ ఏఎస్పీ భుజంగరావుకు చెందిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్‌లోని హఫీజ్పేట లోని శ్రీ సాయిరామ్ టవర్స్‌లో భుజంగరావు నివాసంతో పాటు, మియాపూర్, వనస్థలిపురం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మొత్తం 15 చోట్ల సోదాలు కొనసాగాయి. ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో కూడా తనిఖీలు జరిగాయి. ప్రతి బృందానికి డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహించారు.

సోదాల్లో భాగంగా భుజంగరావుకు సంబంధించిన స్థిరాస్తి పత్రాలు, విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్టు సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

ఫోన్ టాపింగ్ కేసులో భుజంగరావుపై గతంలోనే కేసు నమోదైంది. ఆ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. దీంతో ఆయన్ను ఏఎస్పీ పదవి నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ఏసీబీ తనిఖీల అనంతరం అదనంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసే అవకాశం ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com