హైదరాబాద్ 29°C
అమరావతి 30°C
IST 4:37 PM
శుక్రవారం జూలై 31 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
సాంకేతిక

దేశంలో పోలీసుల నిఘాలో AI వాడకం: ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో క్రిమినల్స్ ట్రాకింగ్

రచన: ఉషా కిరణం డెస్క్ ·
దేశంలో పోలీసుల నిఘాలో AI వాడకం: ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలతో క్రిమినల్స్ ట్రాకింగ్
📷 Łukasz Promiler / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనలో పోలీసులు AI సాంకేతికతతో నిఘా పెట్టారు. నిరసనలో పాల్గొన్న వ్యక్తుల్లో పాత నేరస్తులు ఎవరైనా ఉన్నారా, వారి నేపథ్యం ఏంటి అనేది సులువుగా గుర్తించారు.

పోలీసులు అడ్వాన్స్డ్ ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి కేవలం వీడియో రికార్డ్ చేయడమే కాకుండా, వ్యక్తుల ముఖాల్లోని 80కి పైగా కీలక ఆకారాలను స్కాన్ చేస్తాయి. ఒక వ్యక్తి మాస్క్ పెట్టుకున్నా, గడ్డం పెంచినా, రూపం మార్చినా కెమెరా గుర్తుపడుతుంది. ఈ ఇన్పుట్స్ నేరాల ట్రాకింగ్ కోసం ఏర్పాటు చేసిన CCTNS, NAFIS వంటి జాతీయ డేటాబేస్‌లతో ఆటోమేటిక్‌గా సరిపోల్చబడతాయి. సరిపోతే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అలర్ట్ మెసేజ్ పంపుతుంది. ఫలితంగా గతంలో గంటల కొద్దీ సీసీటీవీ ఫుటేజ్ చూడాల్సిన అవసరం లేకుండా, నేరచరిత్ర ఉన్న వారిని వేగంగా గుర్తిస్తున్నారు.

360 డిగ్రీల కెమెరాలతో కూడిన ప్రత్యేక నిఘా వాహనాలు, మొబైల్ కమాండ్ కంట్రోల్ యూనిట్లు కూడా పోలీసులు వినియోగిస్తున్నారు. ఇవి రద్దీ ప్రాంతాల్లో, పెద్ద సంఖ్యలో ప్రజలు చేరినప్పుడు, అనుమానాస్పద వస్తువులు గమనించినప్పుడు నిజసమయంలో అధికారులను హెచ్చరిస్తాయి. ఏఐ ఆధారిత ఎనలిటిక్స్ వ్యవస్థలు సాధారణ పరిస్థితిని మించి ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.

రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, రాజకీయ ర్యాలీలు, క్రీడా వేడుకలు, అంతర్జాతీయ సదస్సులు వంటి సందర్భాల్లో ఈ కెమెరాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాలతో పాటు అయోధ్య, వారణాసి, కుంభమేళా ప్రాంతాల్లోనూ వీటిని వినియోగిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

అయితే, ఫేషియల్ డేటా వాడకంపై ప్రత్యేక చట్టం లేకపోవడంతో ప్రైవసీ సంరక్షణపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023లో వ్యక్తిగత డేటా ప్రాసెసింగ్‌పై నియమాలు ఉన్నా, ఫేషియల్ డేటా వినియోగానికి ప్రత్యేక కట్టడి లేదు. సేకరించిన డేటా ఎన్ని రోజులు భద్రపరుస్తారు, ఎవరు యాక్సెస్ చేయవచ్చు, తప్పులు జరిగితే బాధ్యత ఎవరిదనే విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com