ఏపీ వార్షిక రుణ ప్రణాళిక విడుదల: 2026-27కు ₹8.1 లక్షల కోట్ల లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో 235వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ₹8.1 లక్షల కోట్ల వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు.
వ్యవసాయం, ప్రాధాన్య రంగాలకు ₹5.4 లక్షల కోట్లు, ఇతర రంగాలకు ₹2.7 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్దేశించారు. వ్యవసాయ రుణాల కింద ₹2 లక్షల కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు ₹10,693 కోట్లు కేటాయించారు. ఎంఎస్ఎంఈ రంగానికి ₹1.55 లక్షల కోట్లు, మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌కు ₹70,000 కోట్లు, గృహ నిర్మాణానికి ₹11,500 కోట్లు, విద్యా రుణాలకు ₹2,500 కోట్లు కేటాయించారు.
సమావేశంలో సీఎం మాట్లాడుతూ, డిజిటల్ ఆర్థిక నేరాల నియంత్రణకు బ్యాంకులు ప్రత్యేక SOP రూపొందించాలని, సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధితుల సొమ్ము నిల్వ చేసేలా తక్షణం స్పందించాలన్నారు. విద్యా రుణాలపై 4% వడ్డీ రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా రుణ ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. పునరుత్పాదక ఇంధనం, డైరీ, ఆక్వా రంగాలకు రుణాలు పెంచాలని బ్యాంకులను కోరారు.
రాష్ట్రంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు బ్యాంకులు ఆయా రంగాలకు ఆర్థిక ఊతం అందించాలని సీఎం చెప్పారు. రాజధాని అమరావతిలో భూములు కేటాయించిన బ్యాంకులు త్వరగా ఐకానిక్ భవనాలు నిర్మించుకోవాలని సూచించారు. రుణ వితరణ, ఎన్పీఏలపై అధికారులు-బ్యాంకర్ల సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com