డీఎస్సీ ఫలితాల ప్రక్రియ సురక్షితం, డేటా లీక్ అవకాశం లేదు: ఎడ్యుకేషన్ సెక్రటరీ
ఏపీ డీఎస్సీ ఫలితాల ప్రకటనపై డేటా లీక్ ఆరోపణల నేపథ్యంలో ఎడ్యుకేషన్ సెక్రటరీ శశిధర్ స్పందించారు. ఫలితాల ప్రక్రియ సురక్షితంగా జరిగిందని, డేటా లీక్‌కు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రశ్నపత్రాల తయారీ, అప్‌లోడ్ కోసం TCS iON ప్లాట్‌ఫామ్‌ను వాడినట్లు తెలిపారు. 20 రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, వివిధ పోటీ పరీక్షల సంస్థలు ఉపయోగించే ఇదే సాఫ్ట్‌వేర్ అని వివరించారు. దీనిలో ప్రశ్నల అప్‌లోడ్ నిర్ణీత రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే చేస్తారని, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఎలాంటి పాత్ర లేదని చెప్పారు.
పాస్‌వర్డ్‌లు ప్రతిరోజు మారుస్తామని, అనధికారిక యాక్సెస్ ఉండదని శశిధర్ తెలిపారు. ఇటీవల కృష్ణా జిల్లాకు చెందిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌కు ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కానందున రూల్ 26 ప్రకారం అతని అభ్యర్థిత్వం పరిగణించబడదని స్పష్టం చేశారు. అతను ఈ విషయమై కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. అలాగే ఇదే ప్లాట్‌ఫామ్ పై దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌బీ, ఐపీబీఎస్, ఎన్టీఏ, ఐఐటీలు, ఎయిమ్స్ వంటి సంస్థలు కూడా ఆధారపడుతున్నాయని గుర్తు చేశారు. కాబట్టి డీఎస్సీ ఫలితాలపై ఎలాంటి అపోహలు వద్దని ఆయన కోరారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com