ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ఏపీ ప్రభుత్వం దృష్టి, నిపుణుల బృందం సూచనలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ఏపీ ప్రభుత్వం దృష్టి, నిపుణుల బృందం సూచనలు
📷 Bijen Amatya / Pexels
షేర్ కాపీ అయింది ✓

శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. కేంద్ర డ్యామ్ భద్రత అథారిటీ, కేంద్ర జలసంఘం సూచనల మేరకు స్వతంత్ర నిపుణుల బృందం డ్యామ్ భద్రత అంశాలను అధ్యయనం చేస్తోంది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ లార్జ్ డామ్స్ డైరెక్టర్ డికే శర్మ ఈ బృందానికి చైర్మన్గా ఉన్నారు. ఈ ప్యానెల్ ఏప్రిల్లో రెండు రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పరిశీలించింది.

ప్రాజెక్టు స్పిల్వే ముందు ఏర్పడిన ప్లంజ్ పూల్ విస్తరణపై నిపుణులు దృష్టి పెట్టారు. 2018, 2025లలో జరిపిన బేతామెట్రిక్ సర్వేల ప్రకారం, ప్లంజ్ పూల్ వెడల్పు 270 మీటర్ల నుంచి 290 మీటర్లకు, పొడవు 400 మీటర్ల నుంచి 450 మీటర్లకు పెరిగింది. లోతు 38 మీటర్లలో మార్పు లేదు. ఈ పూల్ స్పిల్వే వైపు విస్తరించడమే ప్రధాన సమస్య అని, అయితే స్పిల్వే ఫౌండేషన్ కన్నా 12 మీటర్ల లోతు ఉండటంతో తక్షణ ప్రమాదం లేదని నిపుణులు తేల్చారు.

గతంలో ప్లంజ్ పూల్ సమస్య పరిష్కారానికి 62 స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేయగా, తాజా అధ్యయనంలో వాటిలో 42 పూర్తిగా, 14 పాక్షికంగా దెబ్బతిన్నట్లు తేలింది. ప్లంజ్ పూల్ను కాంక్రీటుతో పూరించడం సమస్యను పరిష్కరించదని, 2005లో చేసిన ప్రయత్నం ఫలించలేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీంతో స్పిల్వేకు ప్లంజ్ పూల్కు మధ్య సుమారు 110 అడుగుల ఎత్తు, 3 మీటర్ల వెడల్పు గల కట్-ఆఫ్ వాల్ నిర్మించాలని సూచిస్తున్నారు. ఈ గోడ నిర్మాణంలో ట్రెంచ్ తవ్వి బెంటనైట్ ద్రావణం నింపాలనేది నిపుణుల ఆలోచన. దీని సాధ్యాసాధ్యాలపై పోలవరం డయాఫ్రం వాల్ నిర్మించిన బావర్ కంపెనీ ప్రతినిధులతో అధికారులు చర్చించారు. స్వతంత్ర నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత ఆ మేరకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com