అఫ్ఘనిస్తాన్‌లోని బాలా హిసార్ కోటలో బౌద్ధ ఆనవాళ్లు బయటపడ్డాయి
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని బాలా హిసార్ కోటలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాల ఆనవాళ్లు బయటపడ్డాయి. సుమారు 2,000 ఏళ్ల నాటి ఈ కోటలో ఐదు వేర్వేరు కందకాల్లో తవ్వకాలు జరిపారు.
తవ్వకాల్లో నాణాలు, బౌద్ధ విగ్రహాలు, బౌద్ధ ఆరామాల ఆనవాళ్లతో పాటు ఇస్లామిక్ సిరామిక్స్, నూనె దీపాలు, మట్టి పాత్రలు కూడా లభించాయని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. కొండపై రాతిలో చెక్కిన నక్షత్రాకారపు కొలను, సింహాసనం, మొగల్ ప్యాలెస్‌కు చెందిన స్నానపు గదులు కూడా కనిపించాయి.
కోట పునరుద్ధరణ పనులను ఆగా ఖాన్ ట్రస్ట్ చేపట్టింది. కోటను ఉద్యానవనాలు, మ్యూజియంతో కూడిన పురావస్తు పార్కుగా మారుస్తోంది. ఈ పనుల్లో భాగంగానే తవ్వకాలు జరుగుతున్నాయి.
దరి భాషలో బాలా హిసార్ అంటే ఎత్తైన కోట అని అర్థం. కుహియే షేర్ దర్వాజా పర్వత శ్రేణిపై ఉన్న ఈ కోట, భారత ఉపఖండాన్ని మధ్య ఆసియాతో కలిపే వాణిజ్య మార్గంలో ప్రధాన కేంద్రంగా ఉండేది. క్రీస్తుపూర్వం మొదటి శతాబ్దం నుంచి ఈ కోట రక్షణ కేంద్రం, ఆయుధాగారం, కారాగారంగా ఉపయోగపడింది. 1879లో బ్రిటిష్ అధికారి హత్యకు ప్రతీకారంగా బ్రిటిష్ దళాలు కోటలోని పెద్ద భాగాన్ని ధ్వంసం చేశాయి.
1996 నుంచి 2001 మధ్య తాలిబాన్ పాలనలో బుద్ధ విగ్రహాలు, మ్యూజియం కళాఖండాలు ధ్వంసం అయ్యాయి. 2001లో ఆరవ శతాబ్దం నాటి రెండు భారీ బుద్ధ విగ్రహాలను డైనమైట్లతో పేల్చివేశారు. ఇప్పుడు మాత్రం దేశ చరిత్ర, సంస్కృతిని కాపాడతామని తాలిబాన్ చెబుతోంది. తవ్వకాల్లో లభించిన కళాఖండాలను జాగ్రత్తగా చూసుకుంటామని పేర్కొంటోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com