బాసర ఆలయంలో చోరీ: మహాకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ మాయం
బాసరలోని జ్ఞానసరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. ప్రధాన ఆలయం పై అంతస్తులోని మహాకాళి అమ్మవారి ఆలయంలో వెండి కిరీటం, హుండీ అపహరణకు గురయ్యాయి.
తెల్లవారుజామున 5 గంటలకు ప్రధాన పూజారి శ్రీనివాస్ ఆలయానికి వచ్చి తలుపులు ధ్వంసమై ఉండడం గమనించారు. వెంటనే ఆలయ యాజమాన్యం, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దొంగలు ఆలయం వెనుక వైపు నుంచి ప్రవేశించినట్లు తెలుస్తోంది. మూడు సీసీ కెమెరాలకు గుడ్డలు కట్టి, ఆలయం లోపలికి చొరబడి తాళాలు పగులగొట్టారు. అమ్మవారి ఒంటిపై ఉన్న వెండి కిరీటం తీసుకెళ్లారు. హుండీలోని డబ్బులు కాజేసి, ఖాళీ హుండీని ఆలయ పరిసరాల్లోని గుట్టల్లో పడేశారు. ఆలయంలో ఉన్న బంగారు ఆభరణాలు పోలేదు.
క్లూస్ టీం రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది. సీసీ కెమెరాల్లో ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి ప్రవేశించిన దృశ్యాలు నమోదయ్యాయి. ఆలయ సమీపంలోనే 300 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ ఉంది. రాత్రి విధుల్లో ఆరుగురు హోమ్‌గార్డులు ఉన్నా చోరీని ఎవరూ గుర్తించలేదు.
ఆలయ ఆర్యఈఓ అంజనాదేవి మాట్లాడుతూ "దొంగలు కెమెరాలకు గుడ్డ కప్పి, రెక్కీ నిర్వహించి చాకచక్యంగా చోరీ చేశారు" అని తెలిపారు. పూర్తి దర్యాప్తు అనంతరం నిందితుల వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com