ఆంధ్రప్రదేశ్

జీడిమామిడి తోటల్లో అధిక దిగుబడికి సమగ్ర యాజమాన్య పద్ధతులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
జీడిమామిడి తోటల్లో అధిక దిగుబడికి సమగ్ర యాజమాన్య పద్ధతులు
📷 Abhinav Tripathi / Pexels
షేర్ కాపీ అయింది ✓

బాపట్ల జిల్లా జీడిమామిడి పరిశోధన స్థానం శాస్త్రవేత్త వెంకట సుబ్బయ్య జీడి తోటల్లో సమగ్ర యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు సుమారు 1,27,000 హెక్టార్లలో జీడిమామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఆదాయం పొందలేకపోతున్నారు.

ప్రస్తుతం తోటలు పూత-పిందె దశలో ఉన్నాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ వరకు దిగుబడి వస్తుంది. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడంతో దిగుబడి గత సంవత్సరం కంటే ఎక్కువగా నమోదైంది.

దిగుబడి పెంచడానికి కొన్ని పద్ధతులు శాస్త్రవేత్త సూచించారు. చిగురు, పూత, గింజ పెరుగుదల దశల్లో 2% యూరియా ద్రావణం (1 లీటరు నీటికి 20 గ్రాముల యూరియా) మొక్కలపై పిచికారి చేయాలి. పొటాషియం నైట్రేట్ లేదా 13-0-45 ని 10 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పూత మరియు గింజ పెరుగుదల దశలో పిచికారి చేస్తే గింజ సైజు పెరుగుతుంది. అలాగే 0.5% జింక్ మరియు బోరాన్ మిశ్రమం పిచికారి చేస్తే పరాగ సంపర్కం మెరుగుపడి గింజ సైజు పెరుగుతుంది.

నీటి వినియోగం తగ్గించేందుకు బిందు సేద్యం మరియు mulching పద్ధతులు పాటించాలని వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. కోత తర్వాత పిక్కలను సైజు వారీగా grading చేసి అమ్మితే మంచి ధర వస్తుందని తెలిపారు. జీడిపండును కూడా వేసవిలో పానీయంగా అమ్మితే హెక్టారుకు ₹20,000 నుంచి ₹25,000 అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

చీడపీడల విషయంలో ఈ సంవత్సరం సర్వేలో టీ దోమ మరియు నీలి పిండి నల్లి ఉద్రృతి తక్కువగా నమోదైంది. అయితే పూతమాడు తెగులు 20% వరకు గమనించారు. దీన్ని నివారించేందుకు కొమ్మ కత్తిరింపులు చేసిన వెంటనే Bordeaux mixture పిచికారి చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com