30 అత్యవసర ఔషధాల ధరలపై కేంద్రం గరిష్ట పరిమితి
నేషనల్ ఫార్మస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ (NPPA) 30 కీలక ఔషధాల ధరలపై గరిష్ట పరిమితి విధించింది. మే 26న ఒక ఉత్తర్వు జారీ చేసిన NPPA, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, ఇన్ఫెక్ష న్లు, మహిళల ఆరోగ్య సంరక్షణతో పాటు విటమిన్ D3, కాల్షియం సప్లిమెంట్ల ధరలను నియంత్రించింది.
NPPA ప్రతి సంవత్సరం నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ (NLEM) ని అప్డేట్ చేస్తుంది. ఆ జాబితాలో చేరిన మందుల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తుంది.
కొన్ని మందుల ధరల వివరాల్లో, డయాబెటిస్ కు వాడే ఎంపాగ్లిఫ్లోజిన్+సిటాగ్లిఫటిన్+మెట్ఫార్మిన్ టాబ్లెట్ ధరను గరిష్టంగా రూ. 14.88గా నిర్ణయించారు. ఈ టాబ్లెట్ గతంలో రూ. 18 నుంచి 25 వరకు ఉండేది. అలాగే గుండె సంబంధిత అటోర్వాస్టాటిన్+ఫెనోఫైబ్రేట్ మందు ధర రూ. 31 నుంచి రూ. 18.46కు, టాక్రోలిమస్ 3మి.గ్రా. క్యాప్సూల్ ధర రూ. 222 నుంచి రూ. 127కు తగ్గించారు.
పాత స్టాక్ అయిపోయిన తర్వాత కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియకు 60 నుంచి 90 రోజులు పట్టవచ్చని ఔషధ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ ధరల తగ్గింపు ఆర్థిక భారాన్ని తగ్గించే అవకాశం ఉంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com