హైదరాబాద్ 33°C
అమరావతి 35°C
IST 2:10 PM
మంగళవారం జూలై 14 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

తుంగభద్ర సమస్యలపై కేంద్రం 9 మంది సభ్యుల హైపవర్ కమిటీ ఏర్పాటు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
తుంగభద్ర సమస్యలపై కేంద్రం 9 మంది సభ్యుల హైపవర్ కమిటీ ఏర్పాటు
📷 Gustavo Fring / Pexels
షేర్ కాపీ అయింది ✓

తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలోని సమస్యలను అధ్యయనం చేయడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 9 మంది సభ్యులతో ఒక హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ సంయుక్త కమిషనర్ సంజయ్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.

గత నెల 25వ తేదీన తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటీల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సీఎంలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ మూడు రాష్ట్రాలు తుంగభద్ర జలాల వినియోగం, ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చించాయి. సమస్యల పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలని సీఎంలు కోరారు. దీంతో కేంద్రం ఈ కమిటీని నియమించింది.

కమిటీకి కేంద్ర జల సంఘం (సెంట్రల్ వాటర్ కమిషన్) సభ్యుడు చైర్మన్‌గా నియమితులయ్యారు. కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి, తెలంగాణ, ఏపీ ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు, సీడబ్ల్యూసీ ఉన్నత ఇంజనీర్లు, తుంగభద్ర బోర్డు కార్యదర్శిని సభ్యులుగా చేర్చారు.

ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశించారు. న్యాయ, సాంకేతిక, ఆపరేషనల్, సంస్థాగత అంశాలపై బేసిన్ రాష్ట్రాలు, తుంగభద్ర బోర్డుతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) సాగునీటి అవసరాలను లెక్కించాలి.

ఇక పూడిక కారణంగా నిల్వ సామర్థ్యంపై ప్రభావం, జల విద్యుత్ ఉత్పత్తి ఇబ్బందులు, వరద నియంత్రణ, డ్యామ్ భద్రతపై అధ్యయనం చేయాలి. పూడిక తీతకు అవసరమైన సాంకేతికత, ఖర్చు అంచనాను తయారు చేయాలి. డ్యామ్ దిగువన కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ట్రిబ్యునల్ అవార్డులు, న్యాయపరమైన విషయాలు, ఆర్డీఎస్ నీటి కేటాయింపు ఒప్పందాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com