ఆంధ్రప్రదేశ్

సింగపూర్ పర్యటనలో CM చంద్రబాబు; ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ

రచన: ఉషా కిరణం డెస్క్ ·
సింగపూర్ పర్యటనలో CM చంద్రబాబు; ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ
📷 Hemshah171095 / Wikimedia Commons / cc-by-sa
షేర్ కాపీ అయింది ✓

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సింగపూర్‌లో పర్యటన ప్రారంభించారు. సింగపూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అక్కడి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. పలువురు మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు. సీఎం వారితో మాట్లాడి ఫొటోలు దిగారు.

సీఎం ఈ పర్యటనలో భాగంగా వరల్డ్ సిటీ సమ్మిట్‌లో పాల్గొంటారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఉదయం 10:30 గంటలకు సింగపూర్‌లోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు సమావేశం అవుతారు. ఆ తర్వాత స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రాస్ బంచ్‌తో భోజన సమావేశం ఉంది. అనంతరం సింగపూర్ సీనియర్ మంత్రి లోయన్ లింక్, క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరన్ బజావా, జిఐసి ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిం సియాంగ్, వైసిహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాబర్ట్ యప్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్‌తో వరుస సమావేశాలు ఉన్నాయి. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, విదేశాంగ మంత్రి బాలకృష్ణమన్, హోం మంత్రి కే షణ్ముఖన్, హెచ్ఆర్డీ మంత్రి టాన్ సి లెంగ్‌తో కూడా సీఎం భేటీ కానున్నారు. అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్భానా జురాంగ్ ప్రతినిధులతో కూడా చర్చలు జరుపుతారు.

రేపు జరిగే వరల్డ్ సిటీ సమ్మిట్‌లో సీఎం ప్రసంగిస్తారు. కాకతీయ కల్చరల్ అసోసియేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, సుర్భానా జురాంగ్‌తో అమరావతి ప్రణాళిక సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. సీఐ నిర్వహించే రోడ్‌షోకు హాజరై, సాయంత్రం పలువురు పారిశ్రామిక వేత్తలతో సమావేశం ముగించిన తర్వాత చంద్రబాబు తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరుతారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com