ఛోలే-కుల్చా స్టాల్ నుంచి టీమిండియా U-19 జెర్సీ వరకు: అర్జున్ రాజ్పుత్ స్ఫూర్తిదాయక ప్రయాణం
ముంబైలోని ఛోలే-కుల్చా స్టాల్ యజమాని కుమారుడు, 18 ఏళ్ల అర్జున్ రాజ్పుత్, భారత అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన జట్టులో అర్జున్‌కు స్థానం దక్కింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న అర్జున్, క్రికెట్ ఆడేందుకు ఏడుస్తూ మారాం చేసేవాడు. తన కొడుకు ఆసక్తిని గమనించిన తండ్రి, ఎన్ని కష్టాలైనా తాను భరిస్తానని, బిడ్డ కలను నెరవేర్చేందుకు పూర్తి మద్దతు ఇచ్చారు. 8-9 ఏళ్ల వయసులో హర్భజన్ సింగ్ అకాడమీలో అర్జున్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే మధ్యలో సదరు అకాడమీ మూతపడటంతో ప్రాక్టీస్ చేసేందుకు స్థలం లేక చాలా ఇబ్బంది పడ్డాడు.
కానీ కోచ్ విక్రమ్ సిద్ధూ సార్ మాత్రం అర్జున్‌కు అండగా నిలిచారు. ప్రతి చోటా అతనికి సపోర్ట్ చేశారు. తన కోచ్, కుటుంబ సభ్యుల అండదండలతోనే ఈ స్థాయికి చేరుకున్నానని అర్జున్ చెప్పాడు. తన తండ్రి చాలా కష్టపడి కుల్చాలు అమ్ముతుంటారని, ఆయన త్యాగం తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని తెలిపాడు.
హర్భజన్ సింగ్ గ్రౌండ్‌లో ఆడిన అర్జున్‌కు, హర్భజన్ సింగ్‌తో చాలాసార్లు ములాఖత్ అయ్యే అవకాశం దక్కింది. తన చదువు విషయంలో కూడా హర్భజన్ అకాడమీ బాగా సహాయం చేసిందని, అక్కడ స్కాలర్‌గా 6 సంవత్సరాలు చదువుకున్నానని అర్జున్ తెలిపాడు.
జట్టులో ఎంపికైన విషయం తొలుత కోచ్ నుంచి ఫోన్ కాల్ ద్వారా తెలిసిందని, ఆ తర్వాతే తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చానని అర్జున్ చెప్పాడు. ఉదయం పనిలో బిజీగా ఉన్న తండ్రిని సంప్రదించడం కొంచెం కష్టంగా ఉన్నా, తన కొడుకు సాధించిన విజయం పట్ల తండ్రి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎంపిక తన కుటుంబానికి, తనను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అర్జున్ అన్నాడు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com