ములుగు జిల్లా చిన్నబోయినపల్లిలో ప్రైవేట్ బడులపై నిషేధం: ప్రభుత్వ బడికే పిల్లలను పంపాలని గ్రామసభ తీర్మానం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలో ప్రైవేట్ బడులపై నిషేధం విధిస్తూ గ్రామసభ తీర్మానం చేసింది. గ్రామంలోని పిల్లలందరినీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించారు.
ఈ తీర్మానంలో భాగంగా ప్రైవేట్ స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలను గ్రామంలోకి రానివ్వకూడదని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒకవేళ నిబంధన ఉల్లంఘించి ప్రైవేట్ బడులకు పిల్లలను పంపితే ఆ కుటుంబంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రైవేట్ బడుల్లో అధిక ఫీజుల కారణంగా నిరుపేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తల్లిదండ్రులు వివరించారు. ఒక పిల్లల చదువుకు ఏడాదికి 50 నుంచి 70 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని, తమ వార్షిక ఆదాయం లక్ష రూపాయిల లోపే ఉండడంతో ఫీజులు చెల్లించడం కష్టంగా మారిందని చెప్పారు.
గ్రామసభ నిర్ణయం ఫలితంగా ఒక్క రోజులో 100 మందికిపైగా విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తీసుకున్నారు. సర్పంచ్, గ్రామ పెద్దలు తీర్మానంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా అందుబాటులో ఉందని, పోటీ పరీక్షల ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు బోధిస్తారని గ్రామస్తులు తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com