అన్నమయ్య జిల్లాలో 250 చ.కి.మీ.లో క్రిటికల్ ఖనిజాల అన్వేషణకు కోల్ ఇండియాకు లైసెన్స్
అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని ఒంటిల్లు బ్లాక్‌లో 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో క్రిటికల్ రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణకు కేంద్ర ప్రభుత్వం కోల్ ఇండియాకు లైసెన్స్ ఇచ్చింది. కేంద్ర గనుల శాఖ నిర్వహించిన టెండర్లలో కోల్ ఇండియా ఈ లైసెన్స్ దక్కించుకుంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) ఈ ప్రాంతంలో 24 రకాల అత్యంత విలువైన క్రిటికల్ మినరల్స్ ఉన్నట్లు గుర్తించింది. రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీలు, పునరుత్పాదక ఇంధన రంగాలకు కీలకమైన లెడ్, జింక్, టిటానియం, ఇరిడియం, కార్డ్మియం, మెటల్ జిర్కాన్, సిల్వర్ వంటి ఖనిజాలు ఇక్కడ ఉన్నాయని GSI నివేదికలు చెప్తున్నాయి.
మూడు దశల్లో ఈ అన్వేషణ సాగనుంది. తొలి దశలో G3, G4 స్థాయి జియోలాజికల్ మ్యాపింగ్, కో డ్రిల్లింగ్ ద్వారా ఖనిజాల లోతును గుర్తిస్తారు. నేరుగా మైనింగ్ తవ్వకాలు ప్రస్తుతం చేపట్టరు. రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందించిన ఏడాదిలోపు మైనింగ్ ఒప్పందాలు పూర్తి చేసుకొని ఫీల్డ్ సర్వేలను వేగవంతం చేయనున్నారు. ఈ ప్రాంతంలో అడవులు, కొండలు ఉండటంతో కేంద్ర అటవీ శాఖ నుంచి స్టేజ్-1 అనుమతి తీసుకుంటున్నారు. సర్వే ముందు అన్నమయ్య, తిరుపతి కలెక్టర్ల అనుమతితో పాటు రెవెన్యూ, మైనింగ్ అధికారుల సమక్షంలో సరిహద్దులు గుర్తిస్తారు. మొత్తం అన్వేషణ ప్రక్రియను 5 ఏళ్ల లోపు పూర్తి చేయాలని కేంద్రం నిబంధన విధించగా, మొదటి 3 ఏళ్ల సర్వే తర్వాత ఖనిజాలు లేవని నిర్ధారించిన ప్రాంతాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది.
స్థానికులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని కొందరు ఆశిస్తున్నారు. అయితే, వ్యవసాయ భూముల నష్టం, పర్యావరణ హాని పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ క్వారీ నడుపుతున్న ఆర్క్యాన్ సంస్థ నల్ల రాళ్లను స్వీడన్‌కు ఎగుమతి చేస్తోంది. ఖనిజాల వెలికితీత తర్వాత మిగిలే వ్యర్థాల నిర్వహణపై, పర్యావరణ సమతుల్యతపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, పేదలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com