పత్తి సాగుకు ముందస్తు జాగ్రత్తలు: వ్యవసాయ అధికారి సూచనలు
కడప జిల్లా వేంపల్లి వ్యవసాయ అధికారి బాలగంగాధర్ రెడ్డి పత్తి రైతులకు సాగు విధానంపై కీలక సూచనలు ఇచ్చారు. వర్షాధారంగా పత్తి సాగుచేసే రైతులు జూలై 15 నుంచి 20వ తేదీ వరకు విత్తనాలు వేసుకోవాలని ఆయన తెలిపారు. ఆ తర్వాత విత్తితే దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని చెప్పారు.
విత్తే ముందు లోతైన దుక్కులు దున్ని, మూడు సార్లు గొర్రెలతో దుక్కి చేయించాలని సూచించారు. బీటీ పత్తి విత్తనాలను మాత్రమే వాడాలని, ప్యాకెట్‌లో ఉన్న నాన్-బీటీ విత్తనాలను బార్డర్‌గా వేయాలని చెప్పారు. గులాబీ రంగు పురుగు నివారణకు ఇది ఉపయోగపడుతుందన్నారు. విత్తన శుద్ధి చేసేందుకు ట్రైకోడర్మా విరి లేదా గోచో 600ఎఫ్ఎస్ వాడాలని, విత్తిన మూడు రోజులకు పిండి మిథాలిన్ పిచికారి చేయాలని తెలిపారు.
ఎరువుల యాజమాన్యంలో ఎకరానికి 170 కేజీల యూరియా, 70 కేజీల డీఏపీ, 53 కేజీల ఎంఓపీ వాడాలని, నత్రజనిని 25%, 50%, 25% చొప్పున దశలవారీగా అందించాలని వివరించారు. పుష్పించే సమయంలో మెగ్నీషియం సల్ఫేట్, బోరాన్ స్ప్రే చేయడం వల్ల పిందెలు రాలకుండా, కాయ అభివృద్ధి జరుగుతుందన్నారు.
చీడపీడల నివారణకు రసం పీల్చే పురుగుల కోసం నీమాయిల్, ఇమిడాక్లోప్రిడ్, డయోఫెంతురాన్ వంటి మందులను వాడాలని, ఎల్లో, వైట్, బ్లూ స్టికీ ట్రాప్‌లు పెట్టాలని సూచించారు. తెగుళ్లకు కార్బన్డిజమ్, బ్లైటాక్స్ స్ప్రే చేయాలన్నారు. గులాబీ రంగు పురుగును గమనించేందుకు డెల్టా ఫిరోమోన్ ట్రాప్‌లు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఎమామెక్టింగ్ బెంజోయేట్ పిచికారి చేయాలని తెలిపారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com