పత్తిలో రసం పీల్చే పురుగుల నివారణకు స్టిక్కీ ట్రాప్స్, వేపనూనె సూచన
రాష్ట్రంలో అడపాదడపా కురిసిన వర్షాలు, పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పత్తి పంటపై రసం పీల్చే పురుగుల బెడద పెరుగుతోంది. కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ రాంప్రమాద్ రైతులకు సమగ్ర సస్య రక్షణ చర్యలు సూచించారు.
ఆయన మాట్లాడుతూ, తొలి దశలో పంటకు పేనుబంక, తామర పురుగు వంటి రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉందన్నారు. ఈ పురుగులు ఆకుల రంగు మార్పునకు, మొక్కల ఎదుగుదల నిలిచిపోవడానికి కారణమవుతాయన్నారు.
వీటి నివారణకు ముందుగా ఎల్లో స్టిక్కీ ట్రాప్స్, బ్లూ స్టిక్కీ ట్రాప్స్‌ను ఎకరానికి 10 నుండి 15 చొప్పున పంట ఎత్తు కంటే ఒక అడుగు ఎత్తులో అమర్చాలని సూచించారు. దీనివల్ల గాలి ద్వారా వచ్చే పురుగులు వీటికి అంటుకుని చనిపోతాయి.
ఇక రసాయన మందులకు బదులుగా వేప కషాయం లేదా 1500 పీపీఎం వేపనూనెను లీటర్ నీటికి 5 మి.లీ. చొప్పున కలిపి పిచికారి చేయాలన్నారు. దీనివల్ల రసం పీల్చే పురుగుల గుడ్లు నశించి, తదుపరి దశలో వాటి ఉదృతి తగ్గుతుంది.
తొలిదశలో ఎసిఫేటు మోనో కాంబినేషన్ వాడొద్దని రాంప్రమాద్ స్పష్టం చేశారు. ఇది చీడపురుగులను నియంత్రించినా, మిత్రపురులను నశింపజేస్తుందనీ, దీంతో ఆ తరువాత గులాబీ రంగు పురుగు వంటి ఇతర చీడలు పెరిగే ప్రమాదం ఉందనీ హెచ్చరించారు. పూత దశలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com