గంగమ్మ కస్టడీ మరణం కేసు: సాక్షి దర్గప్ప వాంగ్మూలం రికార్డు
కర్నూలు జిల్లాలో గంగమ్మ అనే మహిళ పోలీసు కస్టడీలో మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యక్ష సాక్షి దర్గప్ప వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. ఈ స్టేట్మెంట్ హైకోర్టుకు సమర్పించారు.
2024 నవంబర్‌లో కౌతాలం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన గంగమ్మ, తన కుమారుడు వీరేంద్ర అదృశ్యమయ్యాడని కర్నూలు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినా, కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో గంగమ్మ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు డీజీపీ సిట్ ఏర్పాటు చేశారు. గుంటూరు అడిషనల్ ఎస్పి సుప్రజ నేతృత్వంలో సిట్ విచారణ ప్రారంభించింది.
విచారణలో గంగమ్మతో పాటు ఆమె ప్రియుడు దర్గప్పను కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించగా, తన కుమారుడు వీరేంద్రను తామే హత్య చేసి, బదినేహాల్ శివార్లలో పాతిపెట్టినట్లు గంగమ్మ, దర్గప్ప ఒప్పుకున్నారు. దీంతో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు.
ఈ క్రమంలో పోలీసుల విచారణ సమయంలో గంగమ్మ గాయపడి, ఆరోగ్యం క్షీణించింది. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 31న ఆమె మృతి చెందింది. జూన్ 1న ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్మార్టం చేసి, అంత్యక్రియలు పోలీసులు రహస్యంగా నిర్వహించారు. గంగమ్మ మృతి తర్వాత దర్గప్ప కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కేసుకు సంబంధించిన ఇటీవలి పరిణామంలో, హైకోర్టు ఆదేశించడంతో ఆస్పత్రిలోనే మెజిస్ట్రేట్ దర్గప్ప వాంగ్మూలాన్ని రికార్డు చేసి న్యాయస్థానానికి సమర్పించారు. వాంగ్మూలంలోని అంశాలు బయటకు రాలేదు. తదుపరి హైకోర్టు ఏం నిర్ణయిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో సిట్ పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com