హైదరాబాద్ 26°C
అమరావతి 30°C
IST 9:19 AM
మంగళవారం ఆగస్టు 4 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు: ఉద్యాన పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షాలు: ఉద్యాన పంటల్లో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు
📷 EqualStock IN / Pexels
షేర్ కాపీ అయింది ✓

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఉద్యాన పంటలు పండించే రైతులు నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంచువాణి, దీర్ఘకాల వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తేమ శాతం తగ్గిపోతుందని, పంటల పెరుగుదల మందగించే ప్రమాదం ఉంటుందని తెలిపారు. పంటల్లో పూత, కాయ రాలడం, దిగుబడి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.

రైతులు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని నివారించి స్థిరమైన ఆదాయం పొందవచ్చని ఆయన వివరించారు. నేలలో తేమ నిల్వ చేసే సామర్థ్యాన్ని పెంచడానికి జీవామ్లం, కంపోస్ట్, వర్మీ కంపోస్ట్ లేదా పచ్చి రొట్ట ఎరువులు వాడాలని సూచించారు.

మల్చింగ్ (ఆర్గానిక్ లేదా ప్లాస్టిక్ మల్చింగ్) వేయడం వల్ల నేలలో తేమ నిల్వ ఉంటుంది. ముఖ్యంగా 50 మైక్రాన్ల సిల్వర్ మల్చింగ్ వాడితే కలుపు మొక్కలు తగ్గి, నేల ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.

నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి డ్రిప్ ఇరిగేషన్ (బిందు సేద్యం), మైక్రో స్ప్రింక్లర్ వంటి పద్ధతులు అవలంబించాలి. అలాగే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా సంరక్షించాలి.

ఎరువుల యాజమాన్యంలో సమతుల పద్ధతి పాటించాలి. నత్రజనిని విడతల వారీగా ఇవ్వడం, వేప పూసిన యూరియా వాడటం వల్ల దీర్ఘకాలం ప్రయోజనం ఉంటుంది. పొటాష్ ఎరువు మొక్కలు బెట్టను తట్టుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారి చేయడం మంచిది.

పండ్ల తోటల్లో తేమ కాపాడేందుకు బేసిన్ మల్చింగ్, బిందు సేద్యం వాడాలి. లేత మొక్కల కాండానికి వైట్ వాష్ (సున్నం) పూస్తే అధిక ఉష్ణోగ్రత నుంచి రక్షణ లభిస్తుంది.

పంటపై ఒత్తిడి తగ్గించేందుకు అవసరమైతే ఫ్రూట్ థిన్నింగ్ (అదనపు కాయలను తొలగించడం) చేయాలి. అలాగే చేడపీడ సోకిన కొమ్మలు, ఎండిపోయిన భాగాలు తొలగించాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి.

వేడెక్కిన వాతావరణంలో రసం పీల్చే పురుగుల (తెల్లదోమ, పిండి పురుగు, తామర పురుగు) ఉదృతి పెరిగే అవకాశం ఉన్నందున సమగ్ర కీటక యాజమాన్యం పాటించాలి.

ఈ చర్యల ద్వారా ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి నాణ్యమైన దిగుబడులు, మెరుగైన ఆదాయం సాధించవచ్చని శాస్త్రవేత్త మంచువాణి సూచించారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com