గోదావరి పుష్కరాలు-2027: ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష, 24న కార్యాచరణ ప్రణాళిక
AP CM చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలు 2027 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 24లోగా కార్యాచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్) తీసుకురావాలని ఆదేశించారు.
పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 525 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తారు. వీటిలో 237 కొత్త ఘాట్లు నిర్మించనున్నారు. ఘాట్ల పొడవును 4.5 కి.మీ నుంచి 9.99 కి.మీకు పెంచాలని నిర్ణయించారు. భక్తుల రద్దీని నివారించేందుకు ప్రతి ఘాట్‌కు నంబర్ కేటాయించాలని సీఎం సూచించారు.
భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్‌స్టేల ఏర్పాటును పరిశీలించాలని, విశాఖ-విజయవాడ మధ్య రైలు సర్వీసులు పెంచడంతోపాటు ప్రత్యేక రైళ్ల కోసం కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాయాలని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రెండు వైపుల రహదారి, ధవళేశ్వరం నుంచి పోలవరం వరకు రోడ్డు అభివృద్ధి చేయాలని, పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకు ముందే పూర్తి చేస్తామన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల క్షేత్ర స్థాయిలో పరిశీలించినప్పుడు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సీఎం అన్నారు. గత పుష్కరాల్లో 4.86 కోట్ల మంది పుణ్యస్నానాలు చేయగా, 2027లో 10 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రద్దీ నిర్వహణ, సాంకేతిక సేవల కోసం ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఆర్‌టిజిఎస్, టిటిడిల సంయుక్త సహకారం తీసుకోనున్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com